రైతు రుణమాఫీకి మరో బిగ్ స్టెప్

రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సమావేశం నిర్వహిస్తున్నది.

Update: 2024-06-19 06:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సమావేశం నిర్వహిస్తున్నది. ఆర్థిక వనరుల సమీకరణకు అన్ని కోణాల నుంచి కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనూ ప్రధాన అజెండా ఐటెమ్‌గా పెట్టుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారని తొలుత చర్చ జరిగినా ఆర్థిక శాఖ వ్యవహారాలను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఫైనాన్స్ డిపార్టుమెంట్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, మరికొందరు అధికారులు హాజరవుతున్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌ సమీపంలోని హోటల్ మ్యారీ గోల్డ్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు వ్యవసాయ సంబంధ సమస్యలు, పెండింగ్ అంశాలు, గత సమావేశంలో చర్చించిన విషయాలు తదితరాలపై రివ్యూ జరగనున్నది.

పంద్రాగస్టుకల్లా రుణమాఫీని అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే హామీ ఇచ్చినందున బ్యాంకుల నుంచి ఏ మేరకు రైతులు రుణాలు తీసుకున్నారో ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్‌కు అనుసరిస్తున్న గైడ్‌లైన్స్ ఈసారి రుణమాఫీ అమలు కోసం ఎంచుకున్నందున కటాఫ్ డేట్‌తో పాటు మొత్తం రుణం తీసుకున్న రైతుల సంఖ్య, ఏ కేటగిరీకి చెందిన రుణాలు, అన్ని బ్యాంకులు కలిపి మొత్తం ఎంత మేరకు రుణాలు ఇచ్చాయి..

తదితర వివరాలన్నింటిపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. రుణం తీసుకున్న వారిలో టాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు మొదలు వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు ఎందరు, వారి ఖాతా కింద రుణం ఎంత ఉన్నది... ఇలాంటివి కూడా చర్చించనున్నారు. ఇప్పుడు మాఫీ చేస్తే ప్రభుత్వం నుంచి ఎంత చెల్లించాల్సి ఉంటుంది, పీఎం కిసాన్ స్కీమ్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంత భారం తగ్గే అవకాశమున్నది తదితర అంశాలన్నింటినీ చర్చించి ప్రభుత్వం ఒక అంచనాకు రానున్నది. దానికి తగిన ఆర్థిక వనరులను సమీకరించుకోవడంపై రానున్న రోజుల్లో దృష్టి పెట్టనున్నది.

Also Read: ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతోంది.. MP మల్లు రవి సంచలన వ్యాఖ్యలు


Similar News