Alleti Maheshwar Reddy: రెండ్రోజుల్లో రేవంత్ సర్కార్ భారీ కుంభకోణం వివరాలు బయటపెడతా.. ఏలేటి సంచలన ప్రకటన

ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

Update: 2025-01-02 11:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. గత ఏడాది అంతా ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందని కనీసం కొత్త సంవత్సరమైనా ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకుని నెరవేర్చాలన్నారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ (BJP) స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఏలేటి.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని మరో రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కామ్ లకు సంబంధించి నాకు చాలా ఆధారాలు దొరికాయని ఇందులో మంత్రుల హస్తం కూడా ఉందని పూర్తి ఆధారాలతో అన్ని వివరాలు బయట పెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సినిమా డైలాగులు బాగానే కొడతున్నారని విమర్శించారు.

దరఖాస్తులంటే రైతులను మోసం చేయడమే:

రైతు భరోసా (రైతు Bharosa) ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయకుండా ఇప్పుడు కమిటీల పేరుతో ప్రభుత్వం సమయం వృథా చేస్తోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుభరోసా గత ఖరీఫ్ లో ఇవ్వలేదు.. ఇప్పుడు రబీ సీజన్ లో అయినా ఇస్తారా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయిందన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను అడ్డుకునేది ఎవరు? ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా? అని ప్రశ్నించారు. రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.. ఈ కమిటీ ఏర్పడి 4, 5 నెలలు దాటినా విధివిధానాలు ఎందుకు ఇవ్వలేకపోయింది. ఎల్లుండి జరగబోయే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కౌలు రైతులు.. యజమానితో మాట్లాడుకోవాలని చెప్పడం సిగ్గుచేటని కౌలు రైతులకు 12 వేలు ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే కదా కాంగ్రెస్ ఆలోచన అన్నారు. రైతు భరోసాకు సంబంధించి 3 రోజులపాటు దరఖాస్తులు తీసుకుంటామని కాంగ్రెస్ చెప్పడం మోసం చేయడమేనని, గత ప్రభుత్వం ఆల్రెడీ రైతుబంధు ఇచ్చింది. అదే రీతిలో రైతు భరోసా ఇవ్వొచ్చుకదా లేదా మీ విధివిధానాలు ఏంటో చెప్పకుండా కాలం వెళ్లదీస్తే ఎలా? అని నిలదీశారు. కౌలు రైతులకు మొండిచేయి చూపకండి. వారిని గుర్తించి ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.35 వేల కోట్లు కాంగ్రెస్ బాకీ పడిందన్నారు. రైతు భరోసా ఇవ్వాలంటే ఒక్క సీజన్ కు రూ. 23 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఇక రెండు సీజన్లకు కలిపి రూ. 46 వేల కోట్లు బకాయి ఉంది. కానీ సర్కార్ బడ్జెట్ లో 15 వేల కోట్లు మాత్రమె కేటాయించింది. మిగతా సొమ్ము ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు కూడా ఏడాదికి 12 వేలు వారి ఖాతాల్లో వేస్తామన్నారు. కేబినెట్ మీటింగ్ ఎజెండాలో దీన్ని పెట్టాలన్నారు.

ఇప్పటి వరకు రూ.1,38,117 కోట్ల అప్పు:

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 390 రోజులు అయిందని ఇప్పటి వరకు 1,38,117 కోట్ల (1.38 లక్షల కోట్ల) రూపాయలు అప్పు తెచ్చిందని ఏలేటి ఆరోపించారు. రోజుకు 354 కోట్ల అప్పు.. గంటకు 14 కోట్ల 70 లక్షల అప్పు చేస్తోందన్నారు. ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటి అప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. 30 వేల కోట్ల కోసం 400 ఎకరాల భూమిని అప్పు తనఖా పెట్టిందని మరో 30 వేల కోట్ల అప్పు కోసం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆరోపించారు. బాండ్ల రూపంలో మరో 30 వేల కోట్ల అప్పులు తేవాలని చూస్తోందన్నారు. అంత ఆ అప్పులు తెచ్చి ఎవరికి ఇచ్చారు? 20 వేల కోట్లను మాత్రమే రుణమాఫీకి కేటాయించారు. 1,18,000 వేల కోట్లు ఎవరి కోసం ఖర్చు చేశారని నిలదీశారు. ఈ డబ్బంతా బడా గుత్తేదారులకు చెల్లించేందుకు ఖర్చు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసం సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారా అని మండిపడ్డారు. రైతులు లేని ప్రాంతాల్లో మాత్రమె కాంగ్రెస్ గెలిచింది.. కానీ గెలిచాక వారికే కాంగ్రెస్ పంగనామాలు పెట్టిందని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించిన విధివిధానాలు ఏమైనా సిద్ధం చేశారా? అంతమందికి ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సంక్రాంతి వరకు 4 లక్షల మందికి ఇండ్లు ఇస్తామని చెప్పారు.. ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? మంత్రి సమాధానం చెప్పాలన్నారు. రుణమాఫీ అవ్వని రైతులకు మాఫీ చేయాలి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News