CM Revanth Reddy : డీలిమిటేషన్ పై అఖిలపక్షం.. హాజరవుతున్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొద్దిసేపటి క్రితం చెన్నై చేరుకున్నారు.

Update: 2025-03-21 16:26 GMT
CM Revanth Reddy : డీలిమిటేషన్ పై అఖిలపక్షం.. హాజరవుతున్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొద్దిసేపటి క్రితం చెన్నై చేరుకున్నారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి చెన్నై వెళ్లారు. ఈ సమావేశం శనివారం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సమావేశం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణ రాష్ట్రాల ఆందోళనలలు, అనుమానాలపై చర్చించడానికి ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ జనాభా ఆధారంగా జరిగితే దక్షిణ రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని, దీనివల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి, డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యల కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా ఉన్నాయి. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి తీసుకున్న తర్వాతే చెన్నై వెళ్ళినట్టు సమాచారం. రేవంత్ గతంలో డీలిమిటేషన్‌ను "దక్షిణ రాష్ట్రాలకు పరిమితి"గా అభివర్ణించి, దీనిని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణ రాష్ట్రాలపై కుట్రగా పేర్కొన్నారు. దక్షిణ రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ వల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్, బీజేడీ నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (బీజేపీ మిత్రపక్షం) ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ను 2026 తర్వాత 30 ఏళ్లపాటు కొనసాగించాలని, 2026 డీలిమిటేషన్ ప్రక్రియను పునఃపరిశీలించాలని డిమాండ్ చేసే తీర్మానం రూపొందించడం, న్యాయపరమైన మార్గాలను అన్వేషించడం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం ఉన్నాయి. ఈ సమావేశం దక్షిణ రాష్ట్రాల ఐక్యతను చాటడంతో పాటు కేంద్రానికి బలమైన సందేశం పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags:    

Similar News