టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: 'తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలనపట్ల ప్రజలు వి
దిశ, వెబ్‌డెస్క్: 'తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. టీఆర్ఎస్ పాలనను అంతం చేసేందుకు ఇదే ఆఖరి పోరాటం కావాలి. అందుకోసం బీజేపీ చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా అండగా నిలిచారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పాటు బీజేపీ గెలుపు కోసం తమవంతు కృషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్నారు. వారందరినీ బీజేపీలోకి స్వాగతిస్తున్నాం' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్‌తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. భిక్షమయ్యకు తరుణ్ చుగ్ కాషాయం కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. తరుణ్ చుగ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సంకినేని వెంకటేశ్వర్ రావు, శ్యాంసుందర్, దాసరి మల్లేశం తదితరులు హాజరయ్యారు.
మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ... తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందనే ఉద్దేశంతో 2018లో టీఆర్ఎస్ లో చేరానని, కానీ నాటి నుండి బడుగు, బలహీనవర్గాలకు ఆత్మగౌరవం లేకుండా చేశారని ఆరోపించారు. బలమైన నాయకులను బలహీనపర్చి వాళ్ల కాళ్లకు బంధాలు వేస్తున్నారని, రెండున్నరేళ్లుగా తాను టీఆర్ఎస్ లో అనేక ఇబ్బందులను అనుభవించానని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో అద్భుతమైన పాలన సాగుతోందని, తెలంగాణలో కూడా బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బీజేపీ గెలుపులో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరానని చెప్పారు.