చెన్నూరు బరిలో వివేక్.. బీజేపీ అభ్యర్థిగా పోటీకి రంగం సిద్ధం

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ఒక్కసారిగా తారుమారవుతున్నాయి. ఆయన నియోజకవర్గం వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు అనూహ్యంగా తెరపైకి వస్తున్నారు.

Update: 2023-03-16 02:15 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు ఒక్కసారిగా తారుమారవుతున్నాయి. ఆయన నియోజకవర్గం వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు అనూహ్యంగా తెరపైకి వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఒంటి చేత్తో నడుపుతున్నారు ఆ నియోజకవర్గంలో ఏది జరగాలన్న సుమన్ కనుసన్నల్లోనే జరుగుతుందనేది నిర్వివాదంశం. అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అనేకమంది సీనియర్ నేతలను పక్కనపెట్టి తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలను సుమన్ ప్రోత్సహిస్తున్నారని ఆ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నది.

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిధులు తీసుకువస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ నియోజకవర్గ నేతలు ద్వితీయ శ్రేణి నేతలను చేరదీయడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు బాల్క సుమన్ వ్యవహారాన్ని మంచిర్యాల జిల్లాకు చెందిన పార్టీ నేతలు కొందరు తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో అన్యమనస్కంగా ఉంటున్న కొందరు నేతలు క్రమంగా ఆయనకు దూరమవుతున్నట్లు సంకేతాలు వెలువబడుతున్నాయి. దీన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయని సమాచారం.

బీజేపీ అభ్యర్థిగా వివేక్ ఉండాలని..

ప్రస్తుత రాజకీయ చెన్నూరు నియోజకవర్గం ముఖచిత్రం చూస్తే బాల్క సుమన్ దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి లేరన్న ప్రచారం ఉంది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి బోడ జనార్ధన్ ఆ నియోజకవర్గంలో ఎక్కువగా సమయం గడపడం లేదు. బీజేపీ నేత అందుగుల శ్రీనివాస్ పార్టీ క్యాడర్ నిర్మాణంలో ఆశించిన స్థాయిలో కృషి చేయడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆర్థికంగా బలంగా ఉన్న నేత ఉంటేనే బాల్క సుమన్‌ను దీటుగా ఎదుర్కోగలరని ప్రచారం జరుగుతున్నది. ఇందుకు బీజేపీ అగ్రనేత మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట స్వామిని చెన్నూరు నుంచి పోటీ చేయించాలని ఆ నియోజకవర్గ సీనియర్ నేతలు సమాలోచనలు జరుగుతున్నట్లు తెలిసింది.

ఇప్పటికే అనేక మంది బీజేపీ నియోజకవర్గ నేతలతో పాటు లోపాయికారిగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు గడ్డం వివేక్‌తో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తే కచ్చితంగా గడ్డం వివేక్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ పరిణామాలు చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయాలను వేడెక్కించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఆయన తండ్రి వెంకటస్వామి ఆయన సోదరుడు గడ్డం వినోద్‌లు ఎమ్మెల్యేలు గెలుపొంది మంత్రులుగా పని చేశారు. అది వివేక్ అక్కడి నుంచి పోటీ చేస్తే బాగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అధిష్టానం సైతం మొగ్గు...

కాగా పార్టీ సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి ని పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని బీజేపీ అధిష్టానం ఎప్పుడో నిర్ణయించింది. అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుత రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చెన్నూర్ నియోజకవర్గంలో బాల్క సుమన్‌ను ఢీ కొట్టాలంటే గడ్డం వివేక్ బలమైన అభ్యర్థి అని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోను చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News