కాంగ్రెస్ లో అధిపత్య పోరు.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కారు పై దాడి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది.
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. బుధవారం కాంగ్రెస్ లోని ఒక వర్గానికి చెందిన నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.వి ప్రతాప్, బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సూరిబాబు అనుచరులు జోడో యాత్రకు బట్వాన్పల్లికి వెళుతుండగా పోచమ్మ టెంపుల్ క్రాస్ రోడ్ వద్ద అప్పటికే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గం నాయకులు మాటుగాసి దాడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు గొమాస శ్రీనివాసు కారును అడ్డుకున్నారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో హథ్ సే హథ్ జోడయాత్ర కొనసాగుతున్నది. ఈ క్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కె.వి ప్రతాప్ పోటిగా తలపెట్టిన జోడయాత్రకు వెళుతుండగా ప్రేమ్ సాగర్ వర్గం అనుచరులు నిలదీశారు.
పోటీ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలని గోమాత శ్రీనివాస్ కారును అడ్డగించి నిలదీశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. కర్రలతో ముష్టి ఘాతకాలకు తలపడ్డారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు బెల్లంపల్లి ఇన్చార్జి చిలుముల శంకర్, బండి ప్రభాకర్, కటకం సతీష్ కాంగ్రెస్ శ్రేణులు గోమాస శ్రీనివాస్ కారును అద్దాలు పగలగొట్టారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరిబాబు, కె.వి ప్రతాప్, మాజీ మార్కెట్ చైర్మన్ రామచందర్ ప్రేమ్ సాగర్ వర్గం నాయకులు దాడి చేశారు. రెండు వర్గాల నాయకులు తోపులాడుకున్నారు. ఈ ఘర్షణలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్, కెవి ప్రతాప్ వాహనాల అద్దాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
గొడవకు ప్రధాన కారణం..
బెల్లంపల్లిలో రెండు వర్గాల మధ్య గొడవకు ముగ్గురు నాయకుల వ్యవహారం అజ్యం పోసింది. ఇటీవల జయరాం, అఫ్జల్, బైరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అధిష్టానానికి సంబంధం లేకుండా వారిని పార్టీలోకి తిరిగి తీసుకోవడంతో ప్రేమ సాగర్ రావు వర్గం గొడవకు దిగింది. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లిజయరాం, బా మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫ్జల్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బైరీ శ్రీనివాసుల రాజీనామాలను డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆమోదిస్తూ వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరిబాబు ఇంట్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాసు, కె.వి ప్రతాప్ తమ వర్గీయులతో రహస్యంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి రాజీనామా చేసిన ముగ్గురు నాయకులను పార్టీలోకి తీసుకున్నారు.
వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్న విషయం ప్రేమ్ సాగర్ రావు వర్గానికి తెలిసింది. అంతేకాకుండా డీసీసీ అధ్యక్షురాలు సురేఖకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ ముగ్గురు నాయకులను పార్టీలోకి తీసుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బట్వాన్పల్లిలో పోటీగా హథ్ సే హాథ్ జోడయాత్ర ఏర్పాటు చేయడం ఈ గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. టీబీసీసీ గోమాస శ్రీనివాస్ వర్గం నాయకులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరిబాబు ప్రేమ్ సాగర్ రావు వర్గంపై తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడికి గురైన వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు.