సర్వే పకడ్బందీగా చేయాలి
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం చేస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను, సర్వే సిబ్బందిని ఆదేశించారు.
దిశ,ఆదిలాబాద్ : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం చేస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను, సర్వే సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను ఈ నెల చివరి నాటికి ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా, పూర్తి పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని, ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో లక్ష 97 వేల 448 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు జిల్లాలో 725 ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సర్వేను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేలా చూడాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ డివిజన్లు, వార్డుల వారీగా 500 మంది దరఖాస్తుదారులకు ఒకరు చొప్పున సర్వేయర్ ను, ఐదుగురు సర్వేయర్ల కు ఒక సూపర్వైజర్ ను నియమించినట్టు చెప్పారు. కొత్తగా నియమించిన సర్వేయర్లు ఎవరైనా ఉంటే అనుభవం ఉన్న వారు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ నెల 13,14 తేదీలలో విస్తృత అవగాహన కార్యక్రమాలపై ఒక రోజు ముందుగానే టామ్ టామ్ వేయించాలని సూచించారు. ఒక్కో సర్వేయర్ రోజుకు కనీసం 25 ఇళ్లను సందర్శించి సర్వే జరిపేలా ప్రణాళికాబద్ధంగా , గడువులోపు పూర్తి చేయాలన్నారు.
అలాగే సర్వేకు వెళ్లడానికి ఒకరోజు ముందే దరఖాస్తు దారులకు సమాచారం అందించాలని, అవసరమైన డాక్యుమెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఇందిరమ్మ కమిటీలు సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం పలు గ్రామాల్లో, కాలనీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. అదిలాబాద్ మండలంలోని చాందా టీ, భీమ్సరి, చిలుకూరి లక్ష్మి నగర్ కాలనీలలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. కలెక్టర్ తో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ప్రత్యేక అధికారి డీఎండీఐసీ పద్మభూషణ్, ఎంపీడీఓ, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.