పంచాయతీలకు ట్రాక్టర్ల భారం..

గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణే లక్ష్యంగా చెత్త సేకరణ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ట్రాక్టర్లను కొనుగోలు చేశారు.

Update: 2024-12-29 11:03 GMT

దిశ, ఆసిఫాబాద్ : గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణే లక్ష్యంగా చెత్త సేకరణ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్లతో పాటు ట్రక్కు, ట్యాంకర్ లను సైతం తీసుకున్నారు. వాటితో గ్రామాల్లోని చెత్త సేకరణతో పాటు మొక్కలకు నీటిని సరఫరా చేసేవారు. గ్రామ సర్పంచ్ లు ఉన్న సమయంలో ట్రాక్టర్ కీస్తీలతో వాటి నిర్వహణ సక్రమంగా ఉండేది. సర్పంచ్ల పదవి కాలం అంనంతరం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన వచ్చిన తర్వాత జీపీలకు నిధులు రాకపోవడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్ల మరమ్మతులు చేయించలేక అధికారులు చేతులేత్తేస్తున్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో కొన్ని నెలలుగా చెత్త సేకరణ నత్తనడకన సాగుతుండగా, చిన్న గ్రామ పంచాయతీల్లో పూర్తిగా నిలిచిపోయింది. కనీసం ట్రాక్టర్ల కీస్తిలు చెల్లించలేక, మరమ్మతులు చేయించలేని పరిస్థితులు నెలకొనడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు అస్తవ్యస్తంగా మారింది.

గాడి తప్పిన నిర్వహణ...

జిల్లాలోని 300 పైగా గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన కీస్తీలు ప్రతి నెలా సుమారు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు ట్రాక్టర్ల కీస్తీలు చెల్లించాల్సి ఉండగా గ్రామ పంచాయతీల్లో నిధుల్లేక ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ఉన్న కొద్దిపాటి నిధులు పారిశుద్ధ్య పనులకే సరిపోతుండటంతో మిగితా పనులకు తీవ్ర ఆటంకంగా మారింది. ట్రాక్టర్లను తీసుకుని ఐదు సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో తరుచూ అవి మరమ్మతులకు వస్తున్నాయి. వాటిని బాగు చేయాలంటే రూ.30 వేల వరకు ఖర్చు అవుతుండటంతో గ్రామ పంచాయతీలకు భారంగా మారింది. చిన్న గ్రామ పంచాయతీలకు కానీసం డీజిల్ కు నగదు లేక వారానికి ఒకసారి మాత్రమే చెత్త సేకరణ చేస్తున్నట్లు సమాచారం. కొందరు గ్రామ కార్యదర్శులు డీజిల్ కు సొంత నగదు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద గ్రామ పంచాయతీల్లో డీజిల్ కిస్తీలకు సంబంధించిన నగదును సర్ధుబాటు చేస్తుండగా, చిన్న గ్రామ పంచాయతీల్లో మాత్రం ట్రాక్టర్లను తిప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.


Similar News