ఆవుపై చిరుతపులి దాడి

తలమడుగు మండలంలో చిరుత పులి, పెద్దపులి సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు.

Update: 2024-12-31 16:03 GMT

దిశ, తలమడుగు : తలమడుగు మండలంలో చిరుత పులి, పెద్దపులి సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన ముడుపు కేదారేశ్వర రెడ్డి ఆవు మేత కోసం నందిగామ శివారు ప్రాంతంలోని అడవిలోకి వెళ్లగా దానిపై చిరుత పులి దాడి చేసింది. అది గమనించిన పశువుల కాపరి బయపడి గ్రామానికి వచ్చి విషయం చెప్పాడు. కాగా చిరుత పులి దాడి చేసిన ఆవు మృతి చెందింది. ఆవు విలువ దాదాపు 40 వేల వరకు ఉంటుందని రైతు తెలిపారు. ఈ విషయమై అటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలాన్ని ఎఫ్ఆర్ఓ పుడలిక్, ఎఫ్ఎస్ఓలు సయ్యద్ ఇమ్రాన్, రవీందర్, బీట్ ఆఫీసర్ హారిక, విశ్వజీత్, ప్రశాంత్, శివ, చరణ్ తదితరులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    కాగా ఇటీవల మండలంలోని డోర్లి శివారు ప్రాంతంలో పెద్దపుల్లి సంచరించినట్లు రైతులు తెలిపారు. అదేవిధంగా కుచలాపూర్ శివారు ప్రాంతంలో చిరుత పులి సంచరించినట్లు, పలువురు రైతులకు చెందిన పశువులను హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో చిరుతపులి, పెద్ద పులులు, ఎలుగుబంట్లు సంచరించడంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. పులుల భయంతో కొంతమంది రైతుల వ్యవసాయ భూముల్లో పత్తి ఏరడానికి కూడా కూలీలు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవీ శాఖ అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని మండల వాసులు కోరుతున్నారు.  


Similar News