సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
సావిత్రిబాయి పూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
దిశ, ఆసిఫాబాద్ : సావిత్రిబాయి పూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతిని, ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు.
18వ శతాబ్దంలో ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదుర్కొని మహారాష్ట్ర ప్రాంతాలలో పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా బాలికలకు విద్యను అందించేందుకు విశేష కృషి చేశారని, మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సావిత్రిబాయి పూలే అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అంతకుముందు 11న నిర్వహించనున్న హైమన్ డార్ఫ్ దంపతుల వర్థంతి పోస్టర్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వర్థంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.