మృతురాలిపై లోన్ తీసుకున్న ఆర్పీపై చర్యలు తీసుకోవాలి
డ్వాక్రా గూప్ సభ్యురాలి పేరుతో బ్యాంక్ లోన్ తీసుకున్న శ్రీ వీర హనుమాన్ (ఎస్ ఎల్ ఎఫ్ )ఆర్పీ మారెల్లి రజిత పై చర్యలు తీసుకోవాలని డ్వాక్రా గ్రూప్ మహిళలు డిమాండ్ చేశారు.
దిశ,బెల్లంపల్లి : డ్వాక్రా గూప్ సభ్యురాలి పేరుతో బ్యాంక్ లోన్ తీసుకున్న శ్రీ వీర హనుమాన్ (ఎస్ ఎల్ ఎఫ్ )ఆర్పీ మారెల్లి రజిత పై చర్యలు తీసుకోవాలని డ్వాక్రా గ్రూప్ మహిళలు డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సాయిరాం గ్రూప్ సభ్యులు పి. మానస, బి.సరస్వతి మాట్లాడారు. 2019 లో గ్రూప్ సభ్యురాలు బొడ్డు లక్ష్మి చనిపోగా ఆమె పేరున కోళ్ల కోసమని రజిత రూ.60 వేల బ్యాంక్ లోన్ తీసుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే తమ గ్రూప్ కు మంజూరు కావాల్సిన రూ.10 లక్షల లోన్ రజిత మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. అంతే కాకుండా వాస్తవాలను ప్రశ్నించినందుకు తమపై ఆమె దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు.
రజిత వల్ల తమకు ప్రాణహాని ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనర్ కు, జిల్లా కలెక్టర్ కు, బెల్లంపల్లి ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. తమకు గంగారాంనగర్ బస్తీలో ఎస్ఎల్ ఎఫ్ ఉండటంతో తమకు దూరాభారమవుతుందని వారు పేర్కొన్నారు. కొత్త ఎస్ ఎల్ ఎఫ్ ఏర్పాటు చేయాలని 4O మంది సభ్యుల సంతకాలతో అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కొత్త ఎస్ఎల్ఎఫ్ ఏర్పాటుకు కూడా రజిత ఆటంకాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చనిపోయిన సభ్యురాలి పేర లోన్ తీసుకున్న ఆర్పి రజితపై తగిన విచారణ జరిపించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త ఎస్ఎల్ఎఫ్ ను అధికారులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రూప్ మహిళలు ఈ.శ్రావణి, ఎం.లీలావతి, శభాన పాల్గొన్నారు.