పట్టణంలో జోరుగా బెల్ట్ షాపుల దందా..రాత్రింబవళ్లు మద్యం అమ్మకాలు

రోజురోజుకు బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ మద్యాన్ని

Update: 2024-12-31 07:30 GMT

దిశ,రామకృష్ణాపూర్ : రోజురోజుకు బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. కొందరు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నారు.రామకృష్ణాపూర్ పట్టణంలో మద్యం ఏరులై పారుతున్న కనీసం అటువైపు ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం ఈ దందా గల్లీకొకటి ఏర్పాటు కావడంతో కొంత యువత,మద్యం ప్రియులు ఉదయం టీ,కాఫీలకు బదులుగా మద్యంను తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ గాయాలపాలవుతున్నారు.పట్టణంలో బీజోన్ సెంటర్,ఆంద్రాబ్యాంక్,రామాలయం,ఆర్కే వన్ వంటి ప్రధాన ఏరియాల్లో,ఆలయాలకు,చౌరస్తాలకు సమీపంలో గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యాన్ని రాత్రింబవళ్లు అమ్మకాలు చేస్తున్నారు.గల్లీ,చౌరస్తా లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల వల్ల మహిళలు రోడ్డుపై తిరగలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఆలయానికి సమీపంలో షాపులను ఏర్పాటు చేయడంతో మద్యం మత్తులో ఆలయాల చుట్టూ పక్కల కూర్చోవడం,భక్తుల మనోభావాలను దెబ్బతింటున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా సిట్టింగ్‌లు ఏర్పాటు..

బెల్టు షాపుల్లో సిట్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నా అధికారులు పట్టించుకొనేవారు లేరు.బెల్టు షాపుల మధ్య పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ బార్‌ అండ్‌ రెస్టారెంట్ల మాదిరిగా బెల్టు షాపుల్లో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతున్నారు.

పార్టీల ముసుగున వ్యాపారం..

పట్టణంలోని బెల్టు షాపుల యజమానులు కొందరు వివిధ పార్టీల కండువాలు కప్పుకొని వాటి చాటున మద్యం అమ్మకాలు చేస్తున్నారు.నాయకులు అండదండలతో షాపుల యజమానుల దందా మూడు పువ్వులు,ఆరు కాయలన్న చందంగా మారింది.షాపు యజమానులు తమను ఎవరు ఏం చేయలేరనే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు.ఎక్సైజ్‌ అధికారులు భారీఎత్తున వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు సందర్శించి,బెల్టు షాపుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News