Collector : విద్యార్థి మృతి ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి షేక్ అయాన్ మృతి చెందడం బాధాకరమని, ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilash Abhinav ) తెలిపారు.

Update: 2024-11-05 15:39 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి షేక్ అయాన్ మృతి చెందడం బాధాకరమని, ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilash Abhinav ) తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ అయాన్ మృతి చెందడంతో ఘటనకు సంబంధించి ఆర్డిఓ రత్న కళ్యాణి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సంతోష్, ఉపాధ్యాయుడు టి. రమేష్, పీఈటీ పెంటన్న, హెల్త్ సూపర్వైజర్ సుజాత లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ తెలిపారు.


Similar News