దళారుల చేతిలో అన్నదాతల దగా..
రైతుల కష్టం దళారుల పాలవుతుంది. దిగుబడులకు మద్దతు ధర పొందడంలో రైతన్నలు దగా పడుతున్నారు.
దిశ, మామడ : రైతుల కష్టం దళారుల పాలవుతుంది. దిగుబడులకు మద్దతు ధర పొందడంలో రైతన్నలు దగా పడుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు అహర్నిశలు పంట చేన్లలో పస్తులు ఉంటూ పంటలు పండించడానికి అనేక కష్టాలు పడుతున్నారు. కానీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారులు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మొక్కజొన్న పంట కొనుగోలు చేయడానికి దళారులు కుమ్మక్కై మద్దతు ధరను తగ్గింపు చేస్తున్నారు.
నేల తల్లిని నమ్ముకున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతుండగా, దళారులు, వ్యాపారులు కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు. వీరు నిర్ణయించిన ధరకు అమ్మడం తప్ప గత్యంతరం లేని దుస్థితి ఉంది. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకొని రైతులను నిండా ముంచుతున్నారు. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న ఇతర పంటలను కొనుగోలు చేస్తున్న దళారులు కేవలం గోన సంచి మాత్రమే తూకం వేస్తున్నారు. ఇక్కడి దళారులు రెండున్నర కిలోల కట్ చేస్తుండడంతో రైతులు కన్నీరు అవుతున్నారు. ఇప్పటికైనా దళారుల బెడద నుంచి అన్నం పెట్టి రైతులను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.