కారు సారథుల మార్పు తప్పదా..?

గత ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పార్టీని మెజార్టీ నేతలు కార్యకర్తలు

Update: 2025-03-17 02:00 GMT
కారు సారథుల మార్పు తప్పదా..?
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిర్మల్ : గత ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పార్టీని మెజార్టీ నేతలు కార్యకర్తలు వదిలి వెళ్లిపోవడంతో కారు పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాలు మినహా పార్టీ కోసం శ్రమించి పనిచేస్తున్న నియోజకవర్గ ఇన్చార్జిలు లేరన్న అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సహా శాసనసభ ఎన్నికల దాకా ఇప్పటి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గులాబీ పార్టీ చర్యలకు దిగినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ఇందులో 5 నుంచి 6 చోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలను మారుస్తారన్న ప్రచారం మొదలైంది.

నాలుగు చోట్ల మాత్రమే పార్టీ ఉనికి..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఉనికి 10 నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు చోట్ల మాత్రమే కొంత ఉనికి చాటుకుంటున్నది మాజీ మంత్రి జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది అలాగే బోథ్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు అనిల్ జాదవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పార్టీకి గట్టి పునాదులే ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఉన్న కారణంగా ఆ నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్ ఎటు వెళ్లకుండా గులాబీ పార్టీకి దన్నుగా ఉంది. ఖానాపూర్ నియోజకవర్గం లో ఇన్చార్జి జాన్సన్ నాయక్ పర్యటనలు అడపాదడపా చేస్తూ పార్టీ కార్యక్రమాలతో పాటు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు భరోసా ఇస్తుండడంతో ఆ నియోజకవర్గంలోనూ పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కార్యకర్తల్లో నిరుత్సాహం..

మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని పార్టీ అగ్రనేతలు సైతం అంగీకరిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీ నాయకులు కొంత సందడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఐదు నుంచి 6చోట్ల ఇన్చార్జిలను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కొంతమంది ముఖ్య నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరగా ఆ నేతలు మళ్లీ భారత్ రాష్ట్ర సమితి గూటికి చేరుతారని ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధానంగా నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిర్పూర్ నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఇద్దరు కూడా కాంగ్రెస్ అధిష్టానం పై కొంత గుర్రుగానే ఉన్నారు.

వారికి ఆశించిన ప్రాధాన్యత దొరకడం లేదని గతంలో తాము కొనసాగిన భారత్ రాష్ట్ర సమితి పార్టీలోనే తమకు విశ్వసనీయతతో పాటు మంచి గుర్తింపు ఉండేదని తమ అనుయాయుల వద్ద అభిప్రాయపడుతున్నారు. అయితే వీరు కాంగ్రెస్ ను వీడుతారా అన్న అంశంపై స్పష్టత లేదు. నిర్మల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న రామ్ కిషన్ రెడ్డి ఆ స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముధోల్ నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పార్టీని వీడిపోవడంతో ఆ నియోజకవర్గంలో మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ విలాస్ గాదేవార్ లలో ఒకరికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అంతగా పార్టీ కోసం కష్టపడడం లేదని చెబుతున్నారు లక్షెట్టిపేట మండలానికి చెందిన ఓ ముఖ్య నేత నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ ను మార్చే అవకాశాలు లేదని చెబుతున్నారు అయితే ఆయన నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా కొత్త వ్యక్తికి అవకాశం కల్పించే పరిస్థితి ఉందని కూడా చెబుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనేక ఆరోపణలు ఎదురుకోవడం తో పాటు పార్టీలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమాచారం ఉంది ఈ నియోజకవర్గంలో కూడా ఇన్చార్జిని మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. సిర్పూర్ నియోజకవర్గం లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇన్చార్జిగా నియమిస్తారని చెబుతున్నారు.


Similar News