ఐసీడీఎస్ నిర్వీర్యాన్ని అడ్డుకోవాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్ శాఖను నిర్వీర్యం చేయాలని చూస్తుందని, వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు.

దిశ, మంచిర్యాల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్ శాఖను నిర్వీర్యం చేయాలని చూస్తుందని, వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ, మొబైల్ సెంటర్స్, ఎన్ఈసీని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఆయా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
అదే విధంగా న్యాయస్థానాల తీర్పుల ప్రకారం గ్రాట్యుటీ, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా 1వ తేదీన అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని రంజిత్ కుమార్ సూచించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు 18 వేల రూపాయల కనీస వేతనంతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం 23 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, ఉపాధ్యక్షురాలు రాజమణి, కమిటీ సభ్యులు సరిత, శంకరమ్మ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.