సమస్యల సాధన కోసం నక్సలైట్ గా మారాలా ?

ప్రభుత్వం, అధికారులు ఆదివాసుల సమస్యలను పరిష్కరించడంలో తాత్సారం చేస్తే నక్సలైట్లుగా మారైనా సమస్యలు సాధించుకుంటామని ఆదివాసీ తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గణేష్ హెచ్చరించారు.

Update: 2025-03-22 10:48 GMT
సమస్యల సాధన కోసం నక్సలైట్ గా మారాలా ?
  • whatsapp icon

దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వం, అధికారులు ఆదివాసుల సమస్యలను పరిష్కరించడంలో తాత్సారం చేస్తే నక్సలైట్లుగా మారైనా సమస్యలు సాధించుకుంటామని ఆదివాసీ తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గణేష్ హెచ్చరించారు. గత ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 72 సర్వే నెంబర్ లో గల కొమరం భీమ్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని సానుకూలంగా, సామరస్యంగా జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజాప్రతినిధుల కాళ్లావేళ్లా పడినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఆదివాసులు సమస్యల పరిష్కారం కోసం శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ముట్టడి చేపట్టి బైఠాయించి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరును ఎండగడుతూ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆదివాసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆదివాసీ నాయకుడు గేడం గణేష్ ఆదివాసులకు నచ్చ చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

     ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, ఎంఆర్వోలు కూడా భూకబ్జాదారులకు, రియల్ ఎస్టేట్​ వ్యాపారస్తులకు అండగా నిలుస్తున్నారు తప్ప తమను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఎన్నో విధాలుగా అధికారులకు, ప్రభుత్వానికి వినతులు అందించినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. సామరస్యంగా మా సమస్యను పరిష్కరించకపోతే నక్సలైట్లుగా మారాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జోగు రామన్న, ప్రస్తుత ఎంపీ జి.నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కంది శ్రీనివాసరెడ్డి సైతం ఆదివాసులను పట్టించుకోవడం లేదని, వీరంతా రాజకీయ దొంగలుగా మారారని ఆరోపించారు. తాము నివాసం ఉంటున్న స్థలంలో గుడిసెలు వేసుకున్న ఆదివాసులకు కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, పట్టాలు అందించాలని పలుమార్లు మంత్రి సీతక్కకు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

    కాలనీలో కరెంటు సౌకర్యం కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా ట్రాన్స్కో ఎస్ఈకి వినతిపత్రం అందించినా ఫలితం లేదన్నారు. తమ దరఖాస్తులు ప్రభుత్వానికి చేరవేయడం లేదని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, ఎమ్మార్వో లు ప్రజల కోసం పనిచేయకపోతే తమ పదవులకు,ఉద్యోగాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కళ్ల ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారి కళ్యాణ్ భూమారెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, ఎమ్మార్వో లకు ఈ కబ్జాలు కనిపించడం లేదా అని అన్నారు. ఇప్పటికైనా తమ రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా ప్రతినిధులు, ఆదివాసులకు అండగా నిలవాలని, అధికారులు సైతం కోర్టులో చట్టాలు అంటూ ఆదివాసుల పట్ల చిన్నచూపు చూడకుండా అసలైన భూ ఆక్రమణదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందులో పలువురు ఆదివాసీ మహిళలు, తుడుం దెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  


Similar News