ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి : నిర్మల్ కలెక్టర్

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష

Update: 2025-03-24 12:07 GMT
ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి : నిర్మల్ కలెక్టర్
  • whatsapp icon

దిశ ప్రతినిధి,నిర్మల్ : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాఖల వారీగా అధికారులందరూ సమయానికి ప్రజావాణి కి హాజరు కావాలని ఆదేశించారు. ప్రజావాణి రిజిస్టర్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పదవ తరగతి పరీక్షల కేంద్రాలను ప్రత్యేక అధికారులు తనిఖీలు చేయాలని, ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శిస్తూ, నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

టెలిఫోన్ ప్రజావాణి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్..

అధిక ఉష్ణోగ్రతల కారణంగా, జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పలు ప్రాంతాల నుంచి ప్రజల అర్జీలను ఫోన్ ద్వారా స్వీకరించారు. ప్రజల సమస్యలను విని, వాటిని నమోదు చేసుకొని, సంబంధిత అధికారులకు ఆయా సమస్యల పరిష్కారం కొరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా సోమవారం టెలిఫోన్ ప్రజావాణి ద్వారా 8 మంది దరఖాస్తుదారులు వివిధ ప్రాంతాలనుండి తమ అర్జీలను సమర్పించారు. దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించి. ప్రజావాణిలో సమస్య నమోదుకు సంబంధించి రసీదును సంబంధిత వ్యక్తులకు వాట్సప్ ద్వారా అందించారు. దూరప్రాంత ప్రజల సహాయార్థం టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పలువురు టెలిఫోన్ ప్రజావాణి అర్జీ దారులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రజావాణి లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News