సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి

సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు.

Update: 2025-03-17 14:18 GMT
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
  • whatsapp icon

దిశ, ఆదిలాబాద్ : సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి వడగాల్పుల వల్ల వచ్చే నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న సందర్భంగా మానవ, మూగ జీవాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు.

     వేసవి కాలం మొత్తం అప్రమత్తంగా ఉంటూ, ఆశా కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, ఆవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని తెలిపారు. బయటకు వెళితే గొడుగు, తలపై టోపీ పెట్టుకొని వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. మున్సిపల్, పంచాయతీ శాఖల ద్వారా ప్రతి కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.

    వడ గాల్పుల వల్ల వచ్చే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని, ఉపాధి హామీ పనులకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఆర్డీఓ వినోద్ కుమార్, విద్యాశాఖ అధికారి ప్రణీత, డీఎంహెచ్ఓ నరేందర్, డీఆర్డీఓ, డీపీఓ, ట్రాన్స్పోర్ట్, విద్యుత్, ఇతర జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Read More..

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు 


Similar News