గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం..
భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదు.
దిశ ప్రతినిధి, నిర్మల్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలవాల్సిన నేతలు ఇప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్లడం తప్ప పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇవ్వడం లేదన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. తూర్పు జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. అధిష్టానం ఇచ్చే పార్టీ కార్యక్రమాలు మినహా మిగతా సమయాల్లో అక్కడి మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు కార్యకర్తలకు సమయం ఇవ్వడం లేదన్న విమర్శలు సొంత పార్టీలో ఉన్నాయి.
కార్యకర్తల కష్టాలు పట్టేదెవరికి..?
సుమారు 15 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కువగా సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గంలో ఆయన అండతో ఎదిగిన నాయకులు ఎందరో ఉన్నారు. ఆ కాలంలో అనేక అవినీతి అక్రమాలకు కూడా అక్కడి నాయకులు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండేవి. ముఖ్యంగా మంచిర్యాల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరిగేది. దీంతోపాటు కొన్ని అక్రమ వ్యాపారాలు కూడా ఆ నియోజకవర్గంలో ఉండేవి. అప్పటి అక్రమ వ్యవహారాలు తాజాగా తెరకెక్కుతుండడంతో ఆ నేతల వెంట కార్యకర్తలపై కేసులు అవుతున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 30 మంది దాకా కార్యకర్తల పై పోలీసు కేసులు పెట్టినట్లు సమాచారం. అప్పటి ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన తనయుడు విజిత్ రావుల అండతో చెలరేగిన కార్యకర్తలు నాయకులు తాజాగా కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో అణిగిమణిగి ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పటి భారత రాష్ట్ర సమితి పార్టీ అధికార అండతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల పై పెద్ద ఎత్తున కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతీకార కేసులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది దీని పై పోలీసులు సాక్షాధారాలతో కేసులు పెడుతుండడంతో అక్రమాలకు పాల్పడిన నేతలు కార్యకర్తల పై కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో అండగా ఉండాల్సిన గులాబీ పార్టీ ముఖ్య నేతలు తమను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉన్న కాలంలో వారికి అండగా నిలిచిన తమకు ఇప్పుడు కేసుల రూపంలో శిక్షలు పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ముఖ్య నేతలు అసలు నియోజకవర్గంలో సమయం కేటాయించడం లేదని అధికార పార్టీ ప్రభావం పెరిగిపోతుండడంతో గులాబీ పార్టీ శ్రేణులు కలవరం చెందుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అడపాదడపా మంచిర్యాలలో ఉంటున్నప్పటికీ నియోజకవర్గంలోని లక్షెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల రూరల్, హాజీపూర్ తదితర ప్రాంతాల్లో అసలు కార్యకర్తలకు సమయం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు చెల్లాచెదురు అవుతున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరి పోగా మరి కొంతమంది త్వరలోనే పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. అప్పుడు యువ నేతగా నియోజకవర్గంలో వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే తనయుడు విజిత్ రావు కూడా ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు పార్టీ వర్గాల్లో ఉన్నాయి.
జిల్లా అధ్యక్షుడు ఎక్కడ..?
మరోవైపు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సైతం తూర్పు ప్రాంతంలో ఎక్కువగా ఉండడం లేదన్న ఫిర్యాదులు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అధికారం ఉన్న కాలంలో కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సహా పార్టీ కేడర్ అంతా ఆయన కనుసన్నల్లో ఉండేది. తూర్పు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఆయన కార్యకర్తలకు ఎక్కువగా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం పార్టీ అధ్యక్షుడు కూడా అంటి ముట్టనట్లుగా ఉంటుండడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
Read More..