పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు గట్టి చర్యలు..
రానున్న లోకసభ ఎన్నికలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్లో రామగుండం సీపీ ఎం శ్రీనివాసులు ఇవాళ విస్తృతంగా పర్యటించారు.
దిశ, బెల్లంపల్లి: రానున్న లోకసభ ఎన్నికలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్లో రామగుండం సీపీ ఎం శ్రీనివాసులు ఇవాళ విస్తృతంగా పర్యటించారు. రామగుండం నుంచి వచ్చిన ఆయన తొలుత మందమర్రి, కాసిపేట, వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్‌తో పాటు బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయం, ఏఆర్‌హెడ్ క్వార్టర్‌ను విజిట్ చేశారు. పోలీస్ స్టేషన్లలో రికార్డులను తనిఖీ చేశారు. లాకప్ గదులతో పాటు సీసీ కెమెరాల పనితీరును నిశితంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరును ఏసీపీ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిసరాలను కూడా పరిశీలించారు. ఆయా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ రేట్ పెండింగ్ సమస్యలు సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి తెలుసుకున్నారు. లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేశారు.
అనంతరం బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో సీపీఎం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు లిక్కర్, మద్యం అక్రమ రవాణాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల పై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్లాన్ చేశామన్నారు. పెర్రి పాయింట్స్ ను గుర్తించామన్నారు. డ్రోన్ ఆపరేషన్ నది పరివాహక ప్రాంతాల్లో నిరంతరం కొనసాగుతుందని వివరించారు. లోక్ సభ ఎన్నికల బందోబస్తు కోసం త్వరలో కమిషనరేట్‌కు కేటాయించిన పారా మిలిటరీ బలగాలు త్వరలో వస్తున్నాయని వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పీడీఎస్ బియ్యం, గంజాయి రవాణా పై ప్రత్యేక నిఘా పెంచామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ దేవయ్య, టూ టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్ల గురజాల ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు.