జాగ్రత్త.... క్షణాల్లో రూ. లక్షలు కాజేస్తారు
అవును వారు దొంగలే కానీ జేబులు కొట్టేయరు.. ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయరు.. కానీ... Special Story on Cyber Crimes
దిశ, మంచిర్యాల టౌన్: అవును వారు దొంగలే కానీ జేబులు కొట్టేయరు.. ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయరు.. కానీ, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లే వాళ్లకు వేదిక. క్లిక్ చేస్తే బుక్ చేస్తారు. లింక్ ఓపెన్ చేస్తే లాక్ చేస్తారు. అంత స్మార్ట్ గా దోచుకుంటారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ కామర్స్ వెబ్ సైట్ బిగ్ బిలియన్ డేస్, షాపింగ్ కార్నివాల్ అంటూ ఏదో ఒక పేరు పెట్టి స్పెషల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ దొంగల ముఠా వారి డేటాను కొట్టేయడానికి కాసుకు కుర్చుంటుంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు సరికొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏదో ఒకటి ఆశ చూపి ఎరవేసి సింపుల్ గా క్లిక్ చేయమని చెప్పి క్షణాల్లో రూ. లక్షలు కాజేస్తున్నారు. నిత్యం సైబర్ మోసాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొంచెం, ఏ మేరపాటుగా ఉన్నా ఖాతాలోని సొమ్ము అంతా ఊడ్చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినవారిలో సామాన్యులే కాకుండా విద్యా వంతులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. పోలీసులు ఎన్నోసార్లు సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా ప్రజలెవరూ వాటిని పట్టించుకోవడం లేదు.
పార్ట్ టైం జాబ్ ఎరగా చూపి...
మంచిర్యాల జిల్లా రామకృష్ణపుర్ కి చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. కరోనా సమయం నుండి ఇంటి వద్దే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఈ నెల 13న వర్క్ చేస్తూ ఉండగా పార్ట్ టైం జాబ్ పేరుతో ఒక లింక్ వచ్చింది. అది ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసింది. అది చూసిన ఆన్లైన్ నిర్వాహకుడు యువతికి వాట్శాప్ ద్వారా కాల్ చేసి మీకు జాబ్ వచ్చింది. మీరు రూ. 3000 కడితే అదనంగా వస్తాయి అని చెప్పడంతో ఆ యువతి తన ఖాతా నుండి రూ. 3000 నిర్వాహకుడు పంపిన స్కానర్ ద్వారా పంపింది. వెంటనే 5 నిమిషాలకు రూ. 3800 వచ్చినట్టు ఓటీపీ ద్వారా తెలిసింది. ఓటీపీ ఓపెన్ చేసి చుసిన యువతికి నిజంగానే అదనంగా డబ్బులు వచ్చాయి. వెంటనే నిర్వాహకుడికి కాల్ చేసి తెలిపింది. అది విన్న నిర్వాహకుడు మళ్లీ ఒక రూ. 50000 పంపించండి.. మీకు దానికి రెట్టింపు డబ్బు ఇస్తాను అని నమ్మబలికాడు. అది నమ్మిన యువతి రూ. 50000 నిర్వాహకుడికి పంపించింది. కొద్దీ సేపటికి నిర్వాహకుడు కాల్ చేసి మీరు పంపిన రూ. 50000 స్ట్రక్ అయ్యాయి. మళ్లీ ఇంకొక రూ. 40000 పంపించండి నేను మీకు తిరిగి దానికి రెట్టింపు డబ్బు పంపిస్తానని చెప్పడంతో యువతి మళ్లీ వెంటనే 40000 రూపాయలు పంపింది. కథం ఇంకేం ఉంది దానితో నిర్వాహకుడు ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేసి ఆన్లైన్ నుండి వెంటనే తొలగిపోయాడు. అదనంగా డబ్బులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్న యువతి మోసపోయానని గ్రహించి బోరున ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి తనకు కాల్స్ వచ్చిన నెంబర్స్ పై కంప్లైంట్ చేసింది. మొత్తానికి ఆ యువతి సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి దాదాపు 90000 రూపాయలు పోగొట్టుకుంది.
కొరియర్ అని చెప్పి.....
మంచిర్యాల పట్టణ రెడ్డికాలనీకి చెందిన ఒక యువకుడు ఇటీవల ఆన్ లైన్ లో కళ్ళ అద్దాలు ఆర్డర్ చేశాడు. అది నోటిఫికేషన్ ద్వారా 6 రోజులలో డెలివరీ చేయబడుతుంది అని యువకుడి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. కానీ 4 వ రోజు నాడే బ్లూ డార్ట్ కొరియర్ నుండి మాట్లాడుతున్నాం సర్ మీరు ఆర్డర్ చేసిన కళ్ళ అద్దాలు వచ్చాయి. కానీ మీ అడ్రస్ మాకు తెలియడం లేదు.. మీ ఫోన్ లో ఎని డెస్క్ అనే ఒక అప్లికేషన్ లింక్ నేను పంపిస్తాను దాన్ని డౌన్ లోడ్ చేయండి అని నమ్మబలికాడు. కొరియర్ బాయ్ మాటలు విన్న యువకుడు నిజం మీ కావచ్చు అనుకుని ఎని డెస్క్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాడు. కొద్దిసేపటికే కొరియర్ బాయ్ వచ్చి ఆర్డర్ ని తనకు అప్పజెప్పాడు. ఇదంతా బాగానే ఉంది కానీ సాయంత్రం వరకు తన ఖాతా నుండి 1,20000 రూపాయలు వేరే అకౌంట్ కి యువకుని ప్రమేయం లేకుండానే జమ చేయబడ్డాయి. అది చూసిన యువకుడు ఏదో మోసం జరిగింది అని గ్రహించి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అనంతరం పోలీసులు మోసం చేసింది కొరియర్ కంపెనీ వాళ్ళా, సైబర్ మోసగాళ్లా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి మోసపోయినవారిలో ఎక్కువగా విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉన్నత ఉద్యోగులు, లాయర్ లు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఇటీవల అయితే ఒక ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ సంస్థకు చెందిన జెనరల్ మేనేజర్ కూడా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీళ్లంతా అత్యాశకు పోయి డబ్బులు ఫ్రీగా వస్తాయి కదా అనే ఆలోచనలతో అనవసరమైన యాప్స్ ఇన్స్ స్టాల్ చేసుకుని ఖాతాలో ఉన్న డబ్బును పోగొట్టుకుని బాధపడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో 2022 నుండి 2023 వరకు దాదాపు 300 మంది ఆన్లైన్ మోసాలకు బలి అయ్యారు.
సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి: మంచిర్యాల పట్టణా సీఐ ఎం. రాజు
ప్రజలు సైబర్ మోసాలపై అవగాహన పెంచుకొవాలి. సైబర్ నేరగాళ్ల నుండి మోసం ఏ విధంగా జరుగుతుందో ముందే ఉహించి పలు జగ్రతలు తీసుకోవాలి. అనవసరమైన యాప్స్ ఇన్స్ స్టాల్ చేయకూడదు. ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకూడదు. ఒకవేళ మోసపోయామని తెలిస్తే వెంటనే కంప్లైంట్ చేయండి. సమయాన్ని వృథా చేసుకోవద్దు. వెంటనే కంప్లైంట్ చేయడం వల్ల సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఉంటుంది. మీ వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి. టోల్ ఫ్రీ నెంబర్ 1930, వెబ్సైట్ www.cybercrime.govt.in ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు.