ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి.. ఇంచార్జి మంత్రి సీతక్క...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు.

Update: 2025-01-06 06:53 GMT

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి ఎంపీ జి.నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా కలెక్టర్ రాజార్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి పలువురు అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు.

దస్నాపూర్ ప్రాంతంలో 10.53 కోట్ల రూపాయలతో చేపట్టే బీటి రోడ్లు, సీసీ డ్రైన్ ల నిర్మాణం చేయనుండగా, మావల మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయ నిర్మాణం కోసం ఐదు లక్షలు, ప్రతి మండలంలో ఒక మాడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అంచనా వ్యయం ఒక కోటి రూపాయలతో చేపట్టే పనులకు, ఆమె భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

అనంతరం దుబ్బగూడ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం ఆమె ప్రారంభించి సకాలంలో వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అంతకుముందు డీఆర్డీఏ వారి సౌజన్యంతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు కావలసిన నాణ్యమైన రుచికరమైన భోజనాలను అందుబాటులో ఉంచాలని ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని సిబ్బందికి సూచించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనుల గురించి మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎంపీ నగేష్ మాట్లాడుతూ ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు ఇవి పూర్తి చేసేందుకు అదనంగా నిధులు కేటాయించి అవి పూర్తయ్యేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క వీటి పై ప్రత్యేక చొరవ చూపించాలని అన్నారు.

ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారని, గడిచిన ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఇక్కడి ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూనే, జిల్లా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించి, ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.


Similar News