MLA Payal Shankar : సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో

Update: 2024-07-22 13:46 GMT

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ఉన్న సమస్యలపై తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ పిల్లలను చూసేందుకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి మైదానం ప్రాంగణంలో ఉన్న క్రీడా పాఠశాలకు వారు చేరుకున్నారు. దీంతో తల్లిదండ్రులను చూసిన క్రీడా పాఠశాలలోని విద్యార్థులు ఒక్కసారిగా అందులో నెలకొన్న అసౌకర్యాలతో పడుతున్న ఇబ్బందులను తల్లిదండ్రులకు వివరించారు. అయితే గమనించిన తల్లిదండ్రులు క్రీడా పాఠశాల పర్యవేక్షకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వారిపై నమ్మకంతో విద్యార్థులను క్రీడా పాఠశాలలో చేర్పిస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్రీడా పాఠశాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం తో పాటు తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడా పాఠశాలలో సౌకర్యాలు, సిబ్బంది కొరతతో సతమతమవుతున్నారని,పూర్తిస్థాయిలో సిబ్బంది నియమించక డిప్యూటేషన్లపై సిబ్బందిని నియమిస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలో సిబ్బంది కొరత వల్ల ఇక్కడి సమస్యలు అగమ్యగోచరంగా మారాయని,ఈ విషయం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ,ఎండీ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మరోసారి పాఠశాల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు.

Tags:    

Similar News