బాలికల భద్రతకు ‘బాల్ శక్తి’.. నిర్మల్ కలెక్టర్ వినూత్న ప్రయోగం

జిల్లా కలెక్టర్..ప్రభుత్వ కార్యక్రమాలను సజావుగా అమలు చేసే అత్యున్నత అధికారి. ప్రతినిత్యం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలపై పూర్తిస్థాయిలో నియంత్రించే అధికారం కలెక్టర్ సొంతం.

Update: 2024-09-21 02:00 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: జిల్లా కలెక్టర్..ప్రభుత్వ కార్యక్రమాలను సజావుగా అమలు చేసే అత్యున్నత అధికారి. ప్రతినిత్యం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలపై పూర్తిస్థాయిలో నియంత్రించే అధికారం కలెక్టర్ సొంతం. కేవలం ప్రభుత్వ పథకాలనే కాకుండా తన స్వీయ నియంత్రణ లో తనకు తట్టిన ఆలోచనను సమాజం మేలు కోసం పనిచేస్తే..! అలాంటి ఆలోచనలే నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు తట్టింది. తాను పనిచేస్తున్న జిల్లాలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఒక కొత్త కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. అదే... నిర్మల్ ‘బాల్ శక్తి’. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన బాలికల సంరక్షణతో పాటు భవిష్యత్తులో వారికి భరోసా కల్పించడంతోపాటు సామాజిక స్పృహ, అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్య, వైద్య, వైజ్ఞానిక, ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్న బాలికలకు అందజేసేందుకు కలెక్టర్ అభిలాష కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఇతర హాస్టల్‌లో చదువుతున్న బాలికలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించే ఆలోచనతో ఆమె వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ముందుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ సంస్థల్లో..

మారుమూల గ్రామాలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు చదువుతున్న ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో తాము చదువుతున్న చోట భద్రత తో పాటు భవిష్యత్ ఉంటుందన్న నమ్మకం కలిగించే దిశగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచడంతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థల మనుగడను పెంపొందించే దిశగా ఆమె ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.

ఓ మహిళగా..

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కొత్తగా తీసుకున్న నిర్ణయం వెనుక అనేక అంశాలు ఉన్నాయి. తానొక మహిళగా ఆమె మహిళా సమాజానికి అండగా ఉండాలని ఈ కార్యక్రమం రూపొందించారు. సమాజంలో బాలికలు, విద్యార్థులు, యువతుల పై జరుగుతున్న అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేసిన కలెక్టర్ వారికి అండగా నిలిచే దిశగా ఈ కార్యక్రమం రూపొందించారు.

నాలుగు ప్రధాన అంశాలపై రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యార్టిని లకు ఈ కార్యక్రమం భరోసా ఇస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నిరుపేద బాలికలకు భవిష్యత్తులో వారికి తాము అండగా ఉంటామని ఈ కార్యక్రమంలో భరోసా ఇవ్వబోతున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం మేరకు 59 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి అవగాహన కల్పించబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన పై ఇప్పటినుంచి వారికి అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం చదువుతున్న పరిధిలో విద్యాబోధన తో పాటు స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కల్పిస్తారు. భవిష్యత్తులో విద్యాపరంగా అవకాశాలు ఉండలేని విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి తో స్థిరపడే దిశగా వారికి అవగాహన కల్పిస్తారు.

అలాగే ఆరోగ్య అవగాహన పై పూర్తి స్థాయిలో ప్రత్యేక వైద్య ఆరోగ్య సిబ్బందితో బాలికలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలికలు కిశోర, కౌమార దశలో ఎదుర్కొనే సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలపై స్క్రీనింగ్ చేసి అలాంటి సమస్యలపై అనుమానాలపై నివృత్తి చేస్తారు. అలాగే సామాజిక పరిజ్ఞానం కల్పించే అంశంలో భాగంగా విద్యార్థులను హాస్టల్ కే పరిమితం చేయకుండా ప్రభుత్వ సామాజిక సంస్థలను పరిచయం చేసే సోషల్ ఎక్స్పోజర్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి నుంచే విద్యార్థులకు ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, పంచాయతీ రాజ్ ఇండస్ట్రీస్, పోలీస్ స్టేషన్, హెల్త్ సెంటర్స్ హాస్పిటల్స్ ఇలా అన్ని విభాగాలకు తీసుకెళ్లి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ సజావుగా జరిగితే విద్యార్థినిలు మానసిక నైపుణ్యం పొందే అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భరోసా ఇవ్వాలనే..

గ్రామీణ నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న విద్యార్థులకు భరోసా ఇవ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమం రూపొందించామని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. విద్య, వైద్య, మహిళా సంక్షేమ, ఆర్థిక శాఖలకు చెందిన జిల్లా అధికారులతో చర్చించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో సొంత కాళ్లపై నిలబడేలా నైపుణ్య అభివృద్ధి పెంచుకునేందుకు ఈ కార్యక్రమం సహాయకారిగా నిలబడుతుందని ఆశిస్తున్నాను. :-నిర్మల్ కలెక్టర్ అభిలాష


Similar News