Sirpur MLA : డీఎఫ్ఓ మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నాడు..
కొమురం భీం జిల్లా డీఎఫ్ఓ మాఫియా డాన్ గా వ్యవహరిస్తున్నాడని
దిశ,కాగజ్ నగర్/బెజ్జూర్ : కొమురం భీం జిల్లా డీఎఫ్ఓ మాఫియా డాన్ గా వ్యవహరిస్తున్నాడని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం సిర్పూర్ రేంజ్ అటవీ కార్యాలయం ఎదుట భారీ జనసందోహం మధ్య నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో అటవీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన హీరాపూర్ బెంగాలీ క్యాంపు కు చెందిన రైతులపై థర్డ్ డిగ్రీ చేసిన సిర్పూర్ రేంజర్, సెక్షన్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలోని రేంజ్ లలో అడ్డగోలు అక్రమ సంపాదనకు మరిగిన ఫారెస్ట్ అధికారులను కాపాడుతూ వారికి నెలవారి టార్గెట్లు పెట్టి డిఎఫ్ఓ ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అటవీ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులు కాంపా నిధులను డిఎఫ్ఓ దుర్వినియోగం చేశారన్నారు వాటిపై సీబీఐ ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే డి.ఎఫోను జిల్లా నుండి బదిలీ చేయాలని అన్నారు. అమాయక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వారి పై తప్పుడు కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేసులు ఉన్న వారి వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తూ చిల్లర పనులకు ఒడిగాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.