సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ సేవలు లభ్యం: బాల్క సుమన్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు ఒకే చోట... MLA Balka Suman Visits

Update: 2023-02-24 14:02 GMT

దిశ, నస్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ సేవలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ పట్టణంలో నూతనంగా నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ బి రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, శాసనమండలి సభ్యులు విటల్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మార్చి 15వ తేదీ లోపు ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. గుత్తేదారులు నిర్మాణ పనులలో అవసరమైతే కూలీల సంఖ్యను పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికార వికేంద్రీకరణ చేస్తూ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అన్ని ప్రభుత్వ సేవలు ఒకేచోట అందించేందుకు సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. జిల్లాలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థల లాభాల్లో 30% వాటా కార్మికులకు అందించడం జరిగిందని, కారుణ్య నియామకాలను పునరుద్ధరించి 15 వేల మందికి పైగా సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి నుండి అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో అధికార యంత్రాంగం పనితీరు అభినందనీయమని, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలను అర్హులైన వారికి అందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News