మెడికల్ దందా..లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది..

మెడికల్ షాపుల దందా ఇష్టారాజ్యమైంది.

Update: 2024-10-22 02:01 GMT

దిశ,ఆసిఫాబాద్ : మెడికల్ షాపుల దందా ఇష్టారాజ్యమైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీటిపై నియంత్రణ కరువైంది. పేదల అవసరం ఆసరా చేసుకుని మెడికల్ షాపుల యజమానులు డాక్టర్లలా సలహాలు ఇస్తూ అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా యథేచ్ఛగా నకిలీ మందుల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సుమారు 300 పైగా మెడికల్ షాపులు ఉండగా వీటిలో చాలా వరకు ఫార్మాసిస్టులు లేకుండానే విక్రయాలు చేస్తున్నారు. రోగి మెడికల్ షాపులకు వెళ్లి జబ్బు పేరు చెబితే ఇంటర్మీడియట్ కూడా చదవని వారు మనకు మందులు ఇస్తున్నారు. కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఏ మందులు ఎన్ని రోజులు వాడాలో మెడికల్ షాపుల నిర్వహకులే చెబుతారు. ఈ విధంగా కొమురం భీం ఆసిఫాబాద్ గిరిజన జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలుగా తమ బిజినెస్ చేస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అధిక లాభాలు ఇచ్చే మందులే విక్రయం..

ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కేవలం ధనార్జనే ధ్యేయంగా మెడికల్ షాపుల దందాను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం మెడికల్ లో అత్యధికంగా లాభాలు ఇచ్చే నాణ్యతలేని మందులను రోగులకు తెచ్చి ఆంటగడూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైద్యులు యాం టీబయాటిక్సి సూచించినప్పుడు ఎందుకోసం రాశారో సదరు ప్రిస్క్రిప్షన్ లో రాయాల్సి దేనని గతంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారమే మెడికల్ షాపుల నిర్వాహకులు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు. షాపులో ఏది అందుబాటులో ఉంటే అది.. దీనిపై ఎక్కువ లాభం ఉంటే ఆ మందుగానే రోగులకు ప్రతిపాదిస్తున్నారు. అలాగే ఎలాంటి అనుమతులు లేని కొన్ని మందులను సైతం గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

ఫార్మాసిస్టులు లేకుండానే షాపుల నిర్వహణ..

మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందుల అమ్మకాలు చేస్తున్నారు. అడ్డదారిన అనుమతులు పొందుతూ ఇష్టానుసారంగా మెడికల్ దందాను నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే మెడికల్ షాపుల నిర్వాహకులే తమ షాపు పక్కనే ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టి మెడికల్ షాపులను కొనసాగిస్తున్నారు. జ్వరం. జలుబు. తలనొప్పి ఇలా ఏదైనా సారి నేరుగా మెడికల్ షాపుకు వెళితే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్ తో పాటు రెండు మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.

లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది..

నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు గల్లీ గల్లీకి పుట్టుకొస్తున్నాయి. మెడికల్ షాప్ బీ ఫార్మసీ పూర్తి చేసిన వారేఉంటూ మందులు ఇవ్వాలి. కానీ జిల్లాలో చాలా వరకు అద్దెకు సర్టిఫికెట్లు తెచ్చుకొని లైసెన్స్ తీసుకొని మెడికల్ దుకాణాలను నిర్వహిస్తున్నావారే అధికంగా ఉన్నారు. సంబంధిత శాఖ అధికారుల ఆశీస్సులతోనే దందా ఏ టెన్షన్ లేకుండా సాఫీగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న క్లినిక్ నుంచి నర్సింగ్ హోం వరకు ఎవరికీ వారే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకుని కాస్త అనుభవం ఉన్నవారితో మందులు అమ్మీ క్యాష్ చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ఇళ్లలో మెడికల్ షాపులను తలపించేలా అన్ని రకాల మందులను తమ వద్ద ఉంచుకున్నారు. నిజానికి ఆర్ఎంపీల వద్ద ఏ మందులు ఉండకూడదు. వారి వద్దకు వచ్చిన వారికి ప్రధమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇష్టానుసారంగా మందులు.. ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఇటీవల వాంకిడి మండలంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మందులు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

పట్టించుకోని అధికారులు..

వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపై జౌషధ నియంత్రణ అధికారుల నిఘా కొరవడింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడూ వస్తారో.. ఎప్పుడూ తనిఖీ చేస్తారో తెలియకుండా ఉంది. ఏది ఏమైనా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించి అర్హత లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ సంప్రదించగా అందుబాటులో రాలేదు.


Similar News