నూతన బొగ్గు ప్రాజెక్టులు.. బెల్లంపల్లికి అభివృద్ధి వెలుగులు..!

బెల్లంపల్లి అభివృద్ధికి ఆమడ దూరం. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి చేజారి.. బొగ్గు గనుల మూసివేతతో కాలగర్భంలోకీ నెట్టబడింది.

Update: 2024-10-21 14:56 GMT

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి అభివృద్ధికి ఆమడ దూరం. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి చేజారి.. బొగ్గు గనుల మూసివేతతో కాలగర్భంలోకీ నెట్టబడింది. పారిశ్రామిక రంగంలో ఏ సంస్కరణలైతే బెల్లంపల్లిని నిర్వీర్యం చేశాయో అవే సంస్కరణలు మళ్లీ బెల్లంపల్లికి పునరుజ్జీవం పోయనున్నాయి. నమ్మశక్యం అనిపించని ఈ నిజం నూతన బొగ్గు గనులు, ప్రాజెక్టుల రాక శుభం పలుకుతున్నాయి. పీనిక్స్ పక్షిలా బెల్లంపల్లి పారిశ్రామికంగా మళ్లీ ప్రాణం పోసుకోనుందన్న శుభవార్త బెల్లంపల్లి ఆబాలగోపాలాన్ని అమాంతం ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది. సింగరేణి పురోభివృద్ధికి మళ్లీ బెల్లంపల్లి కేంద్రంగానే నూతన అధ్యాయానికి భౌతిక పరిస్థితులు స్వాగతం పలుకనున్నాయి.

బెల్లంపల్లి చరిత్ర..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పారిశ్రామిక పట్టణానికి విశిష్టమైన, విభిన్నమైన చరిత్ర ఉంది. సింగరేణిలో బొగ్గు గనుల ప్రస్థానం భద్రాది కొత్తగూడెం ఎల్లందు బొగ్గుట్ట కేంద్రంగా 1889లో మొదలైంది. ఆ తర్వాత మరో బొగ్గు గనుల క్షేత్రవల్లిగా బెల్లంపల్లి ఘణతకెక్కింది. బొగ్గుట్ట, బెల్లంపల్లి సింగరేణి నల్లనేలకు కవల పిల్లలుగా తెలంగాణలో ప్రసిద్ధిగాంచాయి. ఎల్లందు తర్వాత తాండూరు కోల్మెన్స్ పేరిట బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు గనులు 1928 లో శ్రీకారం చుట్టాయి. పదుల సంఖ్యలో భూగర్భ గనులు, 15 వేల మంది కార్మికులతో 80 వసంతాలు సింగరేణి పురోభివృద్ధికి అలుపెరగని సేవలు అందించింది. బొగ్గు పొరల్లో రగిలిన విప్లవోద్యమం సింగరేణి దొరలకు కంటగింపుగా మారింది. నల్ల సూరీలకు కొండంత బలమైంది. విప్లవోద్యమమే సింగరేణికి కొంగుబంగారం అయ్యింది. గిట్టని బాయిదొరలు కుట్రలు పన్నారు.

నల్లసూరీల విప్లవనిప్పు కణికను ఆర్పేందుకు బెల్లంపల్లినే విధ్వంసం చేశారు. అందుకు 1991లో అడుగుపెట్టిన సంస్కరణలను అస్త్రంగా, ఉద్యమాలకు ఊపిరిలూదిన బొగ్గు గనులను మూసివేశారు. కుట్రపూరితంగా బాయి దొరలు సింగరేణి సంపదను విస్మరించి, కార్మికుల జీవితాలను పణంగా పెట్టి సంస్కరణలకు బెల్లంపల్లిని బలిచ్చారు. దిక్కార పురిటిగడ్డకు గొడ్డలిపెట్టుగా నిలిచారు. పారిశ్రామిక పట్టణంగా బొగ్గు గనులతో కళకళలాడిన బెల్లంపల్లిని కళావిహీనంగా మార్చారు. ఉపాధినిచ్చిన బెల్లంపల్లిని బొందలగడ్డచేశారు. సింగరేణి బిడ్డలు పొట్ట చేత పట్టుకొని వలసల బాట పట్టారు. ఇది పారిశ్రామిక అభివృద్ధికి కలికి తురాయిగా నిలిచిన బెల్లంపల్లి తాజా పరిస్థితి. కుట్రలు, కుతంత్రాలకుసాక్ష్యమైన బెల్లంపల్లి నేపథ్యం.

మళ్లీ బెల్లంపల్లి వైపు పారిశ్రామిక అడుగులు..

పాలకులు, పారిశ్రామిక, సింగరేణి నిర్వాహకులకి నిరాశక్తత ఉన్న భౌతిక పరిస్థితుల్లో కీలక పరిణామాలు బెల్లంపల్లికి పారిశ్రామికంగా పునర్జన్మను ఇవ్వనున్నాయి. నాడు పనికిరాదన్న బెల్లంపల్లి, బొగ్గు నిక్షేపాలు బొగ్గు గనుల, విస్తరణకు మరోసారి బీజం వేశాయి. పారిశ్రామిక పునరేకీకరణను నెత్తిన పెట్టుకునే కీలక భూమికకు బెల్లంపల్లి వేదిక కానుందని విశ్లేషకులు అంటున్నారు.

సింగరేణి సిరుల తల్లికి మరో సంతానం బెల్లంపల్లికి జీవనాడి అయింది. నూతన బొగ్గు ప్రాజెక్టు తవ్వకాలకు తానే ఆతిథ్యం ఇవ్వనుంది. పట్టణ నడిబొడ్డున ప్రతి బస్తిలో ఒక్కో బొగ్గుగని ఆ బస్తీల పేర్లతోనే ఉండేది. అనేక భూగర్భ గనులతో వేలాది మంది కార్మికులతో ఉత్పత్తి, ఉత్పాదకతలో సింగరేణి కంపెనీకి సిరులందించి, ఘనత వహించిన బెల్లంపల్లి తన చరిత్రను మళ్ళీ తిరగతోడుతుంది.

అధికారుల తప్పిదం గాడితప్పినగమనం..

దీర్ఘకాలంగా బొగ్గు గనుల పురిటిగడ్డ నేపథ్యం నుంచి బొగ్గు గనుల కేంద్రంగా బాసిల్లినది బెల్లంపల్లి పట్టణం. ఈ పట్టణంలో ఉన్న జీఎం ఆఫీస్ ను 2001లో గోలేటి ప్రాంతానికి మార్చడం వల్ల బెల్లంపల్లి ప్రాంతం ఉనికి ప్రశ్నార్ధకమయింది. సింగరేణి అధికారులు బెల్లంపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోలేటి టౌన్షిప్ కు తరలించి జిఎం ఆఫీస్, ఇతర డిపార్ట్మెంట్ల నిర్మాణానికి, అధికారుల నివాస క్వాటర్లకు గోలేటి టౌన్షిప్, మాదారం టౌన్షిప్ లో కంపెనీ నిర్మించిన సముదాయాలకు రూ. కోట్లు ఖర్చు చేశారు. కంపెనీ అధికారుల తప్పిదాల వల్ల కంపెనీకి ఎంతో నష్టం జరిగింది.

ఇల్లందు ఏరియాలో 70 కిలోమీటర్ల దూరంలో బొగ్గు గనులు వెలిసినప్పటికీ ఆ ప్రాంతంలో ఇంకా జీఎం ఆఫీసును యధావిధిగా కొనసాగిస్తున్నారు. అలాగే కొత్తగూడెం ప్రాంతంలో 100 కిలోమీటర్ల దూరంలో బొగ్గులు ఉన్ననప్పటికీ జీఎం ఆఫీస్ మాత్రం కొత్తగూడెంలోనే ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి కంపెనీకి ఏడు దశాబ్దాలుగా సిరులు కురిపించిన పట్టణాన్ని విస్మరించారు. బొగ్గు గనుల కేంద్రంగా వికసించిన బెల్లంపల్లిని నిర్వీర్యం చేయడం. కంపెనీ ప్రగతికి గుదిబండయిది. బెల్లంపల్లి పట్టణంలో రూ. కోట్లాది సింగరేణి ఆస్తులు ఉన్నాయి. బిల్డింగ్స్, పాత జీఎం ఆఫీస్, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీస్, సింగరేణి హైస్కూల్, బూదేబంగ్లా, ఏరియా క్వాటర్లు, విలాసవంతమైన బిల్డింగ్లు అధికారుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఇల్లందు గెస్ట్ హౌస్ క్లబ్బు, సింగరేణి ఏరియా ఆసుపత్రి, టింబర్ యాడ్, ఏరియా వర్క్ షాప్, స్టోర్ పవర్ హౌస్, ఎక్స్ ప్లోరేషన్ డిపార్ట్మెంట్, బిల్డింగ్ డిపార్ట్మెంట్ల వందలాది ఎకరాల భూములు, వేలకోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. కంపెనీ ఆస్తులు భూ కబ్జాదారుల నుంచి సింగరేణి కాపాడలేకచేతులు ఎత్తేసింది.

నూతన గనులు.. బెల్లంపల్లికి జవసత్వాలు..

బెల్లంపల్లి పట్టణం పారిశ్రామిక పునరుద్ధరణకి నూతన గనులు నాందిపలుకనున్నాయి. బెల్లంపల్లి పట్టణ, పరిసరాల్లో బీపీఏ సాఫ్ట్, వన్, టు, త్రీ, ఫోర్, బొగ్గు గనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. శ్రావణపల్లి ఓసీ, అండర్ గ్రౌండ్ మైన్ ,వేంపల్లి బొగ్గు గనులు ప్రారంభానికి చేరువలో ఉన్నాయి. శాంతిఖని గని లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే 30 సంవత్సరాలు నడిచినా తరగని బొగ్గు నిక్షేపాలు కలవు. ఇంకా 100 సంవత్సరాలు గడిచినా తరగని బొగ్గు నిక్షేపాలు బెల్లంపల్లి ప్రాంతంలోనే నిక్షిప్తమై ఉన్నాయి.

అలాగే గోలేటి మెగా ఓసీ 2024 సంవత్సరం డిసెంబర్లో ప్రారంభానికి సింగరేణి సన్నాహాలు చేస్తుందని సమాచారం. గోలేటి టౌన్షిప్ జీఎం ఆఫీస్ కింద అపారమైన బొగ్గునిక్షేపాలు ఉన్నాయి. వాటి లక్ష్యంగానే నూతన ప్రాజెక్టు వస్తుంది. గోలేటి జీఎం ఆఫీస్ ఎత్తివేత అనివార్యం. బొగ్గు గనుల నిర్వహణకు కేంద్రంగా మళ్లీ బెల్లంపల్లి పట్టణమే ముందుకొస్తుంది. జీఎం ఆఫీసును బెల్లంపల్లిలోనే పునః ప్రారంభించడం కంపెనీ పరిపాలనా సౌలభ్యానికి అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇలా రీజియన్ కు పూర్వ వైభవం..

బెల్లంపల్లి నడిబొడ్డు ఉన్న ఎస్కే గని, బిల్లింగ్ డిపార్ట్మెంట్ ఎస్, అండ్ పీసీ డిపార్ట్మెంట్, వర్క్ షాప్, కాసిపేట వన్ టు బెల్లంపల్లి ఏరియాలో విలీనం చేసి జీఎం ఆఫీస్ ను ప్రారంభించాలి. బెల్లంపల్లికి మళ్లీ ఏరియా హోదాను కల్పించాలి. ఎస్ఆర్పీలో ఉన్న ఆర్కె5, 5B, సీఎస్పీ గనులను మందమర్రి జీఎం ఆఫీస్ పరిధిలో విలీనం చేసి బెల్లంపల్లి రీజియన్లో ఉన్న మూడు ఏరియాలను సమాన స్థాయిలో మ్యాన్ పవర్ ను సరిచేసి మూడు జీఎం ఆఫీసులకు సమాన హోదా దక్కుతుంది. సింగరేణి ఉన్నత యజమాన్యం, ప్రభుత్వం ఏరియాల పునర్విభజనకు పూనుకోవాలని కోరుతున్నారు. సింగరేణి భవిష్యత్తుకు ఉత్పత్తికి ఉత్పాదకతకు తోడ్పాటు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రజలు కోరుతున్నారు.

ఈ రకంగా చర్యలు తీసుకుంటే మళ్లీ బెల్లంపల్లి రీజియన్ కు మహర్దశ పడుతుంది. గనుల పునర్ ప్రస్థాపన పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కొరకు అధికారులు, కార్పొరేట్ యజమాన్యం ప్రణాళిక బద్దంగా నడుచుకుంటే నే ఇది సాధ్యం. బెల్లంపల్లి భవిష్యత్తు కంపెనీ చేతుల్లోనే ఉంది. కలిసొచ్చిన పారిశ్రామిక అభివృద్ధిని సద్వినియోగం చేసుకొని బెల్లంపల్లి పట్టణానికి పూర్వవైభవం తేనున్న నూతన బొగ్గు గనుల పర్యవేక్షణ కేంద్రాన్ని బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలని చిరకాల ప్రజల ఆశలను నిజం కావాలని ఆశిద్దాం..


Similar News