రైతు వేదిక ప్రారంభాని ముందే పగుళ్ళు.. చెదలు పడుతున్న దర్వాజా..
పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన పనులు, ప్రారంభానికీ ముందే పగుళ్లు తేలుతుండడంతో ఆ పనినాణ్యత ఇట్టే తేలిపోతున్నది.
దిశ, కుబీర్ : పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన పనులు, ప్రారంభానికీ ముందే పగుళ్లు తేలుతుండడంతో ఆ పనినాణ్యత ఇట్టే తేలిపోతున్నది. ఐదు అంకెల్లో జీతం తీసుకుంటున్న సంబంధిత శాఖ అధికారుల డొల్లతనం ఇట్టే తేటతెల్లమవుతున్నది. కుబీర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయానికి పక్కనే నిర్మించిన రైతు వేదిక భవనం నాణ్యత డొల్లతనం శనివారం ఇట్టే బయటపడింది. ప్రారంభాని కంటే ముందే రైతు దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతువేదిక భవనానికి ప్రారంభానికి ముందే పగుళ్ళు తేలిన దృశ్యాలను చూసి ఇదేం నాణ్యత అంటూ ముక్కున వేలేసుకున్నారు. లోపల, బయట ఎటు చూసినా పగుళ్ళు తేలిన గోడలు దర్శనమిచ్చాయి.
ప్రధాన ద్వారాన్నీ కర్రతో ఏర్పాటు చేశారు. ద్వారానికి పై భాగాన అమర్చిన కర్ర ఇప్పుడే చెదలు పట్టింది. పగుళ్ళు తేలిన గోడలు చెదలు పట్టిన దర్వాజాను చూసి కొత్తగా నిర్మించిన భవనం ఇదేంటి కథ అంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్ అవతారం ఎత్తడం, వారికి సంబంధిత శాఖ అధికారులు వత్తాసు పలకడంతో నాసీ రకంగా జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్, పనులను పర్యవేక్షించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని పనుల పై జిల్లా అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.