'అగ్రి' సెజ్ 'నిర్మల్'కు దూరమైనట్టేనా..?

Update: 2024-08-23 02:30 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ః వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్పెషల్ ఎకనామిక్ జోన్ (అగ్రి సెజ్) ఏర్పాటుకు సంబంధించి గత సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారీ ప్రాజెక్టు తరలిపోయింది. నిర్మల్ జిల్లా బాసరకు మంజూరైన అగ్రి సెజ్ అప్పటి అధికారుల అనాలోచిత చర్యలతో వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలు రైతుకు దూరమయ్యాయి. ఆ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి ఉంటే నిర్మల్ జిల్లా రైతాంగానికి అనేక లాభాలు సమకూరి ఉండేవి.

బాసరలో ఏర్పాటుకు నిర్ణయం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా అత్యధికంగా వ్యవసాయ పంటలకు ప్రసిద్ధి. నిజామాబాద్ జిల్లాను ఆనుకుని ఉండే నిర్మల్ జిల్లాలో రైతులు భిన్న రకాల పంటలు సాగు చేస్తారు. గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పాటు ఈ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టు, గడ్డెన్న వాగు ప్రాజెక్టు సహా వందలాది చెరువుల కింద పంటలు సాగు చేస్తారు వరి పంట సహా మొక్కజొన్న పసుపు పత్తి తదితర వాణిజ్య పంటలతో పాటు పప్పు ధాన్యాలు ఇలా అనేక పంటలు సాగు చేస్తారు. దీన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం నిర్మల్ జిల్లా బాసర వద్ద అగ్రి సెజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. బాసరలో ఏర్పాటు చేయడం వల్ల నిర్మల్ జిల్లా తో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లా రైతులకు అందుబాటులోకి వస్తుందన్న ఆలోచనతో సెజ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బాసరలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుందని రైతులు ఆశించారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి అనేక పరిశ్రమలు వస్తే ఒకవైపు రైతులకు మంచి లాభాలు రావడంతో పాటు అనేకమందికి వివిధ రకాల ఉపాధి లభిస్తుందన్న ఆశలు పెరిగాయి.

సెజ్ స్థలాల గుర్తింపులో వెనుకంజ

నిర్మల్ జిల్లా బాసరలో అగ్రి సెజ్ ఏర్పాటు కోసం ప్రభుత్వ ఆదేశంతో అప్పటి జిల్లా యంత్రాంగం 600 ఎకరాలను సేకరించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహకారంతో ఈ భూములను గుర్తించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు రావడంతో భూసేకరణ సులువుగా జరిగిపోయింది. అయితే గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రైతుల నుంచి సేకరించిన భూములు బ్యాక్ వాటర్ కోసం సేకరించారు. అయితే ప్రాజెక్టు గరిష్ట నీటి మొత్తానికి చేరిన సమయంలో కూడా ముంపుకు గురికాని 600 ఎకరాలను పరిశ్రమల కోసం అధికారులు ఖరారు చేశారు. పలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ వేత్తలు ఆసక్తి చూపారు. అయితే ఈ భూములను గుర్తించిన రెండు సంవత్సరాలు వరుసగా భారీ మొత్తంలో వరదలు వచ్చాయి ఈ భూముల్లోకి సైతం వరద నీరు వచ్చి చేరింది దీంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నష్టమే తప్ప తమకేమీ లాభం జరగదన్న అభిప్రాయానికి పరిశ్రమల నిర్వాహకులు వచ్చినట్లు సమాచారం. దీంతో బాసరలో అగ్రి సెజ్ ఏర్పాటుకు అడ్డంకులు తలెత్తాయి. బ్యాక్ వాటర్ భూములు కాకుండా మరోచోట భూసేకరణ చేసి ఉంటే నిర్మల్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు అందుబాటులోకి వచ్చి ఉండేవన్న అభిప్రాయాలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి.

బెల్లంపల్లికి తరలింపు..

బాసరలో ఏర్పాటు చేయాల్సిన అగ్రి సెజ్ తూర్పు జిల్లాలోని బెల్లంపల్లికి మార్చారు అక్కడ వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే బెల్లంపల్లిలో ఇంతవరకు భూసేకరణ జరగలేదు. వాస్తవానికి మంచిర్యాల జిల్లా అంతా పారిశ్రామిక ప్రాంతమే. వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ భారీ మొత్తంలో ఆ జిల్లాలో వ్యవసాయం తక్కువగానే ఉంటుంది. భిన్న రకాల పంటలు పండించడం కూడా తక్కువే. బొగ్గు, సిరామిక్ , సిమెంట్ సహా వివిధ రకాల పారిశ్రామిక ఉత్పత్తులు జరిగే ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రభుత్వానికి అగ్రి సెజ్ ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్ట్ అందజేస్తే కచ్చితంగా భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News