లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
దిశ,అదిలాబాద్ : లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా స్థాయి బహుళ సభ్యుల సముచిత అధికార కమిటీ లింగ నిర్ధారణ చట్టంపై శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయవాది ప్రభాకర్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా లీగల్ అథారిటీ సౌజన్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆసుపత్రులు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర కు దగ్గరగా ఉన్న మండలంలో సెక్స్ రేషియో తక్కువగా ఉన్న ప్రాంతాలలో విజిలెన్స్ ఏర్పాటుతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చర్చించారు.
అన్ని స్కానింగ్ కేంద్రాలలో వచ్చే రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా, ఆ స్కానింగ్ కేంద్రంపై పోలీస్ శాఖ సహకారం తో చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆస్పత్రులు, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, లింగ వివక్షపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి నరేందర్, డిప్యూటీ వైద్యాధికారి సాధన, తదితరులు పాల్గొన్నారు.