గుడిహత్నూర్‌లో టెన్షన్ వాతావరణం.. కాలనీవాసుల దాడిలో గాయపడ్డ సీఐ, ఎస్సై
మానసిక స్థితి సరిగా లేని మైనర్ బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి ఉంచిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది.
దిశ, గుడిహత్నూర్: మానసిక స్థితి సరిగా లేని మైనర్ బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి ఉంచిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన చట్ల పోశెట్టి అనే యువకుడు తమ ఇంటి పక్కనే ఉన్న మానసిక స్థితి సరిగా లేని మైనర్ బాలికను తన ఇంట్లో దాచి పెట్టాడు. కూలి పనులకు వెళ్లి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు తెలుపగా అనుమానంతో పోశెట్టి ఇంటికి వెళ్లి చూడగా అమ్మాయి గదిలో బంధించి ఉంచిన విషయాన్ని గమనించిన పోలీసులు తలుపు పగలగొట్టి అమ్మాయిని బయటకు తీశారు.కాలనీవాసులకు సమాచారం అందించగా కాలనీవాసులు పెద్ద మొత్తంలో అతని ఇంటి ముందు గుమిగుడి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా నిందితుడిని బయటకు తీసి తమకు అప్పగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
అనంతరం పోలీసులు బాలిక కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో ఇచ్చోడ సీఐ భీమేష్, గుడిహత్నూర్ ఇచ్చోడ ఎస్సైలు మహేందర్ తిరుపతి ప్రజలను వారించే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలు, పెద్ద ఎత్తున తిరగబడడం తో పరిస్థితి ఉధృతంగా మారింది. ఒక్కసారిగా ప్రజలు రాళ్లదాడికి దిగడంతో దాడిలో సీఐ భీమేష్ తల పగలగా ఇచ్చోడ ఎస్ఐ తిరుపతి కాలికి తీవ్ర గాయం అయింది. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ చేసి ప్రజలను చెదరగొట్టి నిందితుడిని పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సీఐ, ఎస్ఐలను కూడా ఆదిలాబాద్ రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ రాళ్ల దాడిలో ఇచ్చోడ ఎస్సై వాహనం ధ్వంసం అయింది. ఇంట్లో బందీగా ఉన్న బాలికను సైతం అదిలాబాద్ రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉట్నూర్ డిఎస్పి నాగేందర్ ప్రత్యేక బలగాలను గుడిహత్నూర్‌కు తరలించి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనలో నిందితుని ఇంటిని కాలనీవాసులు నిప్పంటించారు.