నిపాని గ్రామంలో అమానవీయ ఘటన

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది.

Update: 2024-03-14 13:52 GMT

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును గ్రామ శివారులోని పంట పొలాల సమీపంలో ఒక నాల పక్కన ముళ్ల పొదల్లో వదిలి వెళ్ళిపోయింది. అటుగా వెళ్తున్న మహిళలు శిశువు ఏడుపు విని చేరదీశారు. వెంటనే గ్రామానికి తీసుకెళ్లి పాలు పట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ప్రదీప్ 108 లో భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ స్వామికి శిశువును అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రదీప్ మాట్లాడుతూ.. ఓ శిశువు పెంట కుప్పలు ఉందన్న విషయం గ్రామస్థుల సమాచారం మేరకు నిపాని గ్రామానికి చేరుకుని ... భింపూర్ ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు.

అనంతరం శిశు సంరక్షణ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు. నవజాత శిశువును ఎవరు వదిలిపెట్టారనే విషయాన్ని విచారణ చేపట్టి తెలుసుకుంటామని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వామి మాట్లాడుతూ శిశువుకు సంబంధించి ఎవరైనా సంప్రదించే వరకు తమ సంరక్షణలో ఉంచుకోవడం జరుగుతుందన్నారు. అక్రమ సంబంధమో, అవాంఛిత గర్భంమో తెలియదనీ, కన్నతల్లి కర్కశం ప్రేమకు ఈ ఘటన అద్దం పట్టగా.. తోటి మహిళలే ఆ పసి ప్రాణానికి పాలు పట్టడం చర్చనీయాంశంగా మారింది.


Similar News