రవ్నీత్ సింగ్ బిట్టు తల తెచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తా
కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తల తీసుకువచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, ఉట్నూర్ : కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తల తీసుకువచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జి ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తల తెచ్చిన వారికీ రివార్డు ఇస్తాం అని కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టు తలను తీసుకొచ్చిన వారికి తన ఆస్తి, తన తండ్రి పేర ఉన్న ఆస్తిని బహుమానంగా ఇస్తానన్నారు.
కేంద్రంలో గాడ్సే ప్రభుత్వం ఉందని, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి బీజేపీ నిరంతరం కుట్ర పన్నుతోందన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటి వరకు స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం నుండి వచ్చిన ప్రజల నాయకుడన్నారు. రవ్నీత్ బిట్టుపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ బురద చల్లుతుందని,10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, సీఎం రేవంత్ రెడ్డిపై విచ్చలవిడిగా మాట్లాడుతూ నోరు పారేసుకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం, బ్లాక్ అధ్యక్షులు ఏక్బాల్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూట రాజేశ్వర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అచ్చదేవానందం, టీపీసీసీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మోబిన్, మాజీ సర్పంచ్ లు ఆత్రం రాహుల్, పెందుర్ కళావతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిరుదుల లాజర్, సయ్యద్ నిసార్ పాల్గొన్నారు.