చెన్నూరు దశ, దిశను మార్చిన ఉద్యమ నాయకుడు బాల్క సుమన్: మంత్రి హరీశ్ రావు
గత పాలకుల నిర్లక్ష్యంతో 50 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని చెన్నూరు పట్టణాన్ని అన్ని.... Harishrao Comments
దిశ, చెన్నూర్: గత పాలకుల నిర్లక్ష్యంతో 50 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని చెన్నూరు పట్టణాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తూ దశా, దిశా మార్చిన నాయకుడు బాల్క సుమన్ అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని రూ. 2 వందల కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, పట్టణాన్ని రోల్ మోడల్ గా తయారు చెయ్యాలనే సంకల్పంతో నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపిస్తున్న నాయకుడు, నాటి ఉద్యమ స్ఫూర్తితో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమ కారునిగా ఎన్నో లాఠీ దెబ్బలు తిని నాయకుడిగా ఎదిగి ఈరోజు చిత్తశుద్ధి, నిజాయితీ, సేవ, పట్టుదలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల హృదయాలలో ఒక సుస్థిర స్థానాన్ని సాధించుకున్నాడంటూ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఆయన పొగిడారు. యువ నాయకునిగా ఎదిగి, మెదిగి ముఖ్యమంత్రి ప్రేమానురాగాలు పొందిన వ్యక్తి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. ఈ ప్రాంతం నుండి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన నాయకులు ఉన్నప్పటికీ గత నాలుగు సంవత్సరాలుగా బాల్క సుమన్ చేస్తున్న అభివృద్ధి 50 సంవత్సరాలలో ఏ నాయకుడు చేయలేదని ఆయన అన్నారు.
చెన్నూరు పట్టణానికి స్థానిక ఎమ్మెల్యే కోరిన విధంగా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని, పట్టణంలోని అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీల వ్యవస్థ అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలను మంజూరు చేయిస్తున్నానని, అదేవిధంగా చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ను కూడా స్థానిక ముఖ్యమంత్రితో మాట్లాడి అతి తొందరలోనే మంజూరు చేయించుటకు కృషి చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితో నేడు బస్సు డిపో, వంద పడకల ఆసుపత్రి, సమ్మక్క సారక్క భవనాలు, ప్రతి గ్రామపంచాయతీలో గ్రంధాలయ నిర్మాణముల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. చెన్నూరు పట్టణాన్ని చెన్నూరు ప్రజలే మర్చిపోయే విధంగా అభివృద్ధి చేస్తున్నాడని ఇటువంటి నాయకునికి నియోజకవర్గ ప్రజల అండదండలు ఎల్లవేళలా ఉండాలని ఆయన అన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్న ఉద్యమ నాయకునికి తన సపోర్టు ఎప్పుడూ ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి లాంటి పథకాలన్నీ మహిళల పేరుపైనే అందిస్తూ మహిళలకు పెద్ద పీట వేస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, దళిత బంధు, రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, మరియు పండిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని అని అన్నారు. అంతేకాకుండా త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పనులు మిగతా ఏ రాష్ట్రంలో జరగడంలేదని, అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ లకు మింగుడు పడటంలేదని ఆయన అన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయని, తెలంగాణ జాతి గర్వపడేలా కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ పాలిట దేవుడని ఆయన అన్నారు. అనంతరం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తను గతంలో పలుసార్లు చెన్నూరులో పర్యటించానని కానీ గత రెండు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యాను అని అన్నారు. బాల్క సుమన్ నాయకత్వంలో పట్టణాన్ని ఎంతో సుందరీకరణంగా తయారు చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.