ఎంతకాలం ఈ అద్దె పాలన..?

దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు లేవు.

Update: 2024-09-30 08:59 GMT

దిశ,బెల్లంపల్లి: దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు మారిన ఆఫీసుల పురోగతిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లోని ప్రభుత్వ కార్యాలయాల దుస్థితి ఇది. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంతో పాటు కన్నెపల్లి, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఇప్పటికీలేవు. కిరాయి భవనాల్లోనే దీర్ఘకాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులకు పక్కా భవనాల కల్పన ఒక కలగానే మిగిలిపోయింది. ఏళ్లు గడిచిన ఎంతోమంది అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తూపోతున్నారూ. కానీ అదే దుస్థితిలో అద్దె భవననాల్లోనే ఆఫీసులో దర్శనమిస్తున్నాయి.

సింగరేణి భవనాలే దిక్కు..

బెల్లంపల్లి ప్రభుత్వ ఆఫీసులు పక్కా భవనాలకు నోచుకోవడం లేదు. సింగరేణి సంస్థకు చెందిన భవనాలే దిక్కయ్యాయి. బెల్లంపల్లి సబ్ డివిజన్ కార్యాలయానికి కేటాయించిన భవనం, తాసిల్దార్ కార్యాలయం సైతం కొనసాగుతున్న భవనాలు సింగరేణివే. ఇవే కాదు అబ్కారి శాఖ భవనం కూడా కిరాయిదే. నియోజకవర్గం హెడ్ క్వార్టర్ వ్యవహరించే బెల్లంపల్లి లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం పరిపాలన దీనావస్థకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

శిథిలావస్థలో అద్దె భవనాలు..

కిరాయి భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆఫీసులు అసౌకర్యానికి నెలవుగా మారాయి. బెల్లంపల్లి తహసీల్దార్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పటి పాఠశాల పురాతన భవనంలోని కొన్ని గదులను తహసీల్దార్ ఆఫీస్ కోసం కేటాయించారు. మొత్తంగా ఈ భవన సముదాయం ఏ కోశానా క్షేమకరం కాదు. అదేవిధంగా కాల్ టెక్స్ లోని అద్దె భవనంలో కొనసాగుతున్న ఎక్సైజ్ ఆఫీసు కూడా శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఇరుకు గదుల్లో, అసౌకర్యంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల రెవెన్యూను సమకూరుస్తున్న అబ్కారీ ఆఫీస్ కు పక్కా భవనం లేకపోవడం విడ్డూరంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ పరిపాలన కేంద్రాలైనా ప్రభుత్వ ఆఫీసులకు పక్కా భవనాల ఏర్పాటుపై ఇప్పటికీ పాలకుల దృష్టి పడక పోవడం దురదృష్టకరం. అద్దె భవనాల్లో పాలల్లో పాలన ఎంతకాలమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పక్క భవనాల కోసం కనీసం అధికారులు ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదనలు కూడా పంపేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆఫీసులకు పక్కా భవనాలు కనుచూపుమేరలో కాన వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజా ప్రతినిధులు పరిపాలన ఫలాలను ప్రజలకు అందించే ప్రభుత్వ ఆఫీసుల అవసరాన్ని మర్చిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణానికి ప్రతిపాదనలు, నిధులు మంజూరు చేయాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన సౌలభ్య సౌదాల ఆవశ్యతను ప్రజలు, అసౌకర్యాల మధ్య పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇకనైనా పాలకులు గుర్తించాలని పలువురు కోరుతున్నారు.


Similar News