సరస్వతీ నమస్తుభ్యం.. అభివృద్ధి అస్తవ్యస్తం.

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం దేశంలోనే

Update: 2024-09-29 09:08 GMT

దిశ,బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. దక్షిణ భారతావనిలో ఏకైక సరస్వతీ ఆలయం కూడా ఇదే తెలంగాణకు మణిహారమై.. రోజూ వేలాది మంది భక్తుల సందర్శించే ఈ క్షేత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఏటికేడు భక్తుల సంఖ్య ఆదాయంలో వృద్ధి నమోదవుతున్న.. అందుకు అనుగుణంగా వసతుల కల్పన జరగకపోవడం, ఆలయ పునర్నిర్మాణ పూజలు జరిగిన అనంతరం అభివృద్ధి పనులు ఆగిపోవడంతో చదువుల తల్లి ఆవేదన చెందుతోంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భక్తులు, ఆదాయపరంగా యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తర్వాతి స్థానం బాసర సరస్వతి ఆలయానిదే. 2015 పుష్కరాల నుంచి బాసర ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముడం మినహా రోజుకు సగటున 5 వేల నుంచి 10 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాలు, పండగ సెలవులు, పర్వదినాల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది.

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం..

భక్తుల సంఖ్య తో పాటు కరోనా అనంతరం గత మూడేళ్లుగా ఆలయాదాయంలోనూ నిలకడైన వృద్ధి కన్పిస్తోంది. గతంలో రూ.11 కోట్లుగా ఉన్న ఆలయ ఆదాయం 2015-16లో రూ.20 కోట్లుగా నమోదైంది. అప్పటి నుంచి ఆదాయ సముపార్జనలో బాసర ఆలయం ముందున్న,వసతుల పరంగా ఇక్కడ చాలా లోటుపాట్లు ఉన్నాయి. భక్తులకు సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది కూడా ఇక్కడ లేరు. ముప్పై సంవత్సరాల కిందట, అప్పటి అవసరాల మేరకు నియమితులైన సిబ్బందే ఆలయంలో ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి పని చేపట్టలేని పరిస్థితి. గతంలో జరిగిన వసంత పంచమి, మూల నక్షత్రం ఉత్సవాలకు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ సమస్యలు కళ్లకు కట్టాయి. చిన్నారులు గంటల తరబడి క్యూ లైన్లలో అలమటిస్తూ, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క అలమటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కనీస వసతులైన తాగునీరు, విశ్రాంతి సముదాయాలు, చివరకు మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా సరిపడా లేకపోవడం దర్శనార్థం వచ్చే అమ్మవారి భక్తులకు అవస్థలే మిగులుస్తోంది.

వీఐపీలకు మాత్రమే..

సాధారణ భక్తులకు ఉపయోగపడే ఆలయానికి సంబంధించి గతంలో తితిదే వారి వంద వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఆ భవనానికి మరమత్తులు చేస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సాధారణ భక్తులు దాదాపు 3000 పెట్టి బయట ప్రైవేట్ లాడ్జిలలో కుటుంబ సభ్యుల అవసరాల కోసం రూములు తీసుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు.ఆలయం ఆధ్వర్యంలో అతిథి గృహాలు దాదాపు 40 ఉన్న వేలాదిగా తరలి వచ్చే భక్తులకు అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. పైగా అవి ఉత్సవాల్లో కేవలం వీవీఐపీ లకు మాత్రమే అని ముందుగానే రిజర్వేషన్ చేసి వారు మెప్పు పొందే ప్రయత్నం ఏటా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతిథి గృహాలు కూడా రాష్ట్రంలోని వివిధ ఆలయాల ఆర్థిక సాయంతో నిర్మించినవే. అందులోనూ వాటిపైన ఒక ఫ్లోర్ నిర్మించి మరింత గదులు ఏర్పాటు చేసి వీఐపీ సేవలో తరిస్తూ సాధారణ భక్తుల అవసరం పక్కన పెట్టేశారు దేవాదాయ శాఖ అధికారులు. నూతన 500 గదులతో అతిథి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్న దీర్ఘకాలంగా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం వచ్చే నెల 3వ తేదీ నుంచి బాసర ఆలయంలో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు వసతి లేకపోవడం తో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. ఐతే ప్రైవేట్ లాడ్జి లలో అధికారులు తనిఖీలు చేసి భక్తులకు రూములు అందుబాటు రేటు లో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

బాసర నిధులు ఏమైనట్టు..

గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో బాసర ఆలయ అభివృద్ధికి 50 కోట్ల నిధులు మంజూరు కాగా అందులో కొంత మేర అంటే దాదాపు 8 కోట్ల వరకు ఆలయ అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మిగిలిన ఆ నిధులు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం తిరిగి వెనుకకు తీసేసుకుందని కొందరు.. మరికొందరేమో అలాగే ఉన్నాయా ని చెప్పుకొస్తున్నారు. దీంతో అసలు నిధులు ఉన్నాయా వెనుకకు వెళ్ళిపోయాయ అని భక్తులు అయోమయంలో ఉన్నారు.

దర్శనం నరకప్రాయం..

కనీసం దర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూ కాంప్లెక్స్ లు నిర్మించలేదు. ఫలితంగా ఉత్సవాలు, రద్దీ సమయంలో భక్తులు వానకు నానుతూ, ఎండకు ఎండుతూ గంటల తరబడి రోడ్లపై పడిగాపులు పడాల్సి వస్తోంది. అక్షరాభ్యాసం నిమ్మితం చిన్నారులతో కలిసి వస్తున్న వారికి ఇది నరక ప్రాయమవుతోంది.


Similar News