'మంచిర్యాల గడ్డ పై గులాబీ జెండా ఎగరేయాలి'
అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే మంచిర్యాల గడ్డ పై గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
దిశ, మంచిర్యాల : అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే మంచిర్యాల గడ్డ పై గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి నివాస గృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ఎప్పుడు జరగని అభివృద్ధి జిల్లాలో జరిగిందని చెప్పారు. జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలతో పాటు మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం లిఫ్ట్, కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు స్థిరీకరణ పనులతో పాటు పడ్తనపల్లి లిఫ్ట్ వచ్చాయని గుర్తు చేశారు. మంచిర్యాలలో శాంతియుత వాతావరణం ఉండాలంటే మేధావులు, యువత ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆలోచించి సౌమ్యుడు, కలుపుగోలు మనిషి, వివాద రహితుడైన దివాకర్ రావును మరోసారి ఆదరించాలని కోరారు.
గూండా రాజ్యం రావద్దని, మంచి రాజ్యం ఉండాలనే ఆశయంతో మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటూ కలిసికట్టుగా సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో పని చేస్తామన్నారు. మూడోసారి తెలంగాణ సీఎం కేసీఆరేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు అన్ని విధాల ప్రయోజనం చేకూర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ నే అని చెప్పారు. సింగరేణి లాభాల్లో 32 శాతం వాటా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి పాల్గొన్నారు.