మనఊరు-మనబడి ద్వారా కార్పొరేట్ స్థాయికి సర్కార్ బడులు : ఎమ్మెల్యే బాపురావ్
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా, పాఠశాల విద్యను బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభిృద్ధి చేస్తోందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు.
దిశ, ఇచ్చోడ : ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా, పాఠశాల విద్యను బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభిృద్ధి చేస్తోందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని అడేగామ బీ గ్రామంలో మంగళవారం మన ఊరు-మన బడి పథకంలో భాగంగా రూ. 4.86 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్, తెలుగు మీడి యంలో బోధన జరుగుతున్నదని, తల్లిదండ్రలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని సూచించారు.
ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో పిల్లల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. మన ఊరు-మన బడి ద్వారా పాఠశాలలు ఎంతో సుందరంగా మారాయన్నారు. పాఠశాలలలో ఎక్కడా సమస్యలు లేకుండా, అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం 13 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 3 లక్షల, 9 వేల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కదం వనిత, జెడ్పీటీసీ కదం సుభద్ర, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణా రెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, ఉపాధ్యక్షులు సిద్దవార్ వెంకటేష్, తహసీల్దార్ రాథోడ్ మోహన్ సింగ్, డీఈవో ప్రణీత, ఎంఈవో రాథోడ్ ఉదయ్ రావ్, నాయకులు ప్రవీణ్ కుమార్, గాయిక్వాడ్ గణేష్, భీముడు, ముస్తాఫా, సుభాష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.