నిర్మల్ జిల్లాల్లో.. నమ్మకానికి పెద్దపీట
నిర్మల్ జిల్లాలోని కీలకమైన నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది.
దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని కీలకమైన నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కే శ్రీహరి రావు కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది. వర్గ రాజకీయాలకు తావు లేకుండా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు సూచన మేరకు రెండు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తొలి నుంచి శ్రీహరి రావు తోనే..
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన మేడిపల్లి మాజీ సర్పంచ్ సోమ భీమ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు కు కుడి భుజంలా కొనసాగుతూ వస్తున్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీహరి రావు రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా భీమ్ రెడ్డి ఆయన వెన్నంటి నడిచారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పలువురు గట్టిగా పోటీ పడినప్పటికీ శ్రీహరి రావు సూచన మేరకు భీమ్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయగా ప్రభుత్వం నుంచి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇక సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా శ్రీహరి రావుకు ఆ మండలంలో అత్యంత సన్నిహితుడిగా పేరున్న స్వర్ణ మాజీ సర్పంచ్ అబ్దుల్ హాది నియమితులయ్యారు. ఆయన కూడా శ్రీహరి రావు తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. శ్రీహరి రావు రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో అబ్దుల్ హాది ఆయనకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు సూచన మేరకు రెండు మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను పాలకవర్గాలను అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఇద్దరు మార్కెట్ చైర్మన్ ల ఖరారుతో జిల్లా రాజకీయాల్లో శ్రీహరి రావు తనను నమ్ముకున్న వారికి పెద్దపీట వేశారన్న పేరు పొందారు.
నిర్మల్ మార్కెట్ కమిటీ..
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ఖరారు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రత్యేక రఘునందన్ రావు జీవో 755 ను జారీ చేశారు. చైర్మన్ గా సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఈటెల శ్రీనివాస్, పాలకమండలి సభ్యులుగా గజేందర్, జి గంగారాం, కె రాజారెడ్డి, వంజరి రూప, ఎం ఏ అజీమ్, సి మురళి, పి వంశీకృష్ణ, నిమ్మ సాయన్న, ఆర్ వెంకటేష్, సుంకరి సురేష్, సయ్యద్ ఖలీల్, ట్రేడర్స్ నుంచి మంత్రి రాజగోపాల్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సారంగాపూర్ మార్కెట్ కమిటీ
సారంగాపూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ఖరారు చేస్తూ జీవో 753 ను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్ గా అబ్దుల్ హాదీ, వైస్ చైర్మన్ గా ఎల్ శంకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సాద ప్రశాంత్, రాథోడ్ పుష్ప, కొత్త కాపు పోతా రెడ్డి, నేరడిగొండ శ్రీనివాస్, తాటి మహిపాల్, శీల సాయినాథ్, అహ్మద్ ముక్తార్, ఆత్రం నాగోరావు, ట్రేడర్స్ నుంచి పడిగెల కేదార్ నాథ్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా నియామకాలతో కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.