ఎత్తిపోతల అక్రమాలపై డీఈని నిలదీసిన రైతులు

లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రైతులు నిర్మాణం పనులను అడ్డుకున్నారు.

Update: 2023-05-05 14:31 GMT

రైతులకు తెలియకుండా కమిటీ ఏర్పాటు పై ఆగ్రహం

దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రైతులు నిర్మాణం పనులను అడ్డుకున్నారు. శుక్రవారం రైతులకు అవగాహన కల్పించేందుకు వెళ్లిన ఎత్తిపోతల పథకం డీఈ హంజా నాయక్ ను రైతులు అడ్డుకొని నిలదీశారు. ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం తమ విలువైన భూములను ఇవ్వగా తమ గ్రామానికి చెందిన భూములకు నీళ్లు ఇవ్వకుండా ఇతర గ్రామాల రైతులకు లబ్ధి చేకూరేలా పనులు కొనసాగుతున్నాయని ముందుగా నిర్వహించిన సర్వే ప్రకారం పిప్రి గ్రామానికి చెందిన 250 ఎకరాలకు నీరందేలా పనులు చేపడితేనే నిర్మాణం పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న పైపులైన్ పనులతో కేవలం 80 ఎకరాలకే సాగునీరు అందుతుందని మిగతా భూమికి నీరందించాలని డీఈ ని కోరారు.

రైతులకు తెలియకుండా కమిటీ ఏర్పాటు పై ఆగ్రహం...

పిప్రి గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులకు తెలియకుండా ఎత్తిపోతల కమిటీ ఎలా ఏర్పాటు చేస్తారని డీఈ ని నిలదీశారు. ప్రస్తుతం నియమించిన కమిటీ కాంట్రాక్టర్, అధికారులకు వత్తాసు పలుకడంతో నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన జిల్లా స్థాయి నాయకుడు చెప్పిన విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పూర్తి ఆయకట్టుకు నీరందేలా పనులు చేపడితేనే కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కమిటీ తాత్కలికమే.. : డీఈ హంజా నాయక్

పిప్రి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి దాదాపు రూ.70 కోట్లు అవసరం అవుతాయని గతంలో నివేదికలు పంపాము. కానీ ప్రభుత్వం రూ.59.80 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో ప్రధాన పైప్ లైన్, తదితర పనులు చేయిస్తున్నాం. గతంలో సర్వే చేసిన ప్రకారం భూములకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే ఇంకా రూ.15 నుంచి రూ.20 కోట్లు అవసరం అవుతాయి. నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాము. ఆ నిధులు మంజూరు అయితే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు అందించవచ్చు. అలాగే ప్రస్తుతం ఏర్పాటు చేసింది తాత్కాలిక కమిటీ మాత్రమే. నిర్మాణం పనులు పూర్తైన తర్వాత రైతులు పూర్తిస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. పనులు పటిష్టంగా పూర్తి చేయిస్తాం. రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దు.

Tags:    

Similar News