భాగవతం విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
ప్రజలు అందరూ భాగవతం విశిష్టతను తెలుసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : ప్రజలు అందరూ భాగవతం విశిష్టతను తెలుసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణమఠంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భాగవతం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. కాగా మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రవచకులు శ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మ భాగవత విశిష్టతను భక్తులకు వివరించనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన వీధుల గుండా భక్తులు శోభాయాత్ర చేపట్టారు. స్తానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం శోభాయత్రను అట్టహాసంగా ప్రారంభించారు.
ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగురామన్నలతో పాటు సామాజిక వేత్త ముడుపు మౌనిష్ రెడ్డి, పలువురు నేతలు, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొనగా భక్తులు పెద్ద ఎత్తున సాంప్రదాయ దుస్తుల్లో హాజరై శోభాయాత్రలో పాల్గొన్నారు. భగవత్ నామ కీర్తనలతో కాషాయ ధ్వజాలను చేతపట్టుకుని శోభాయాత్ర చేపట్టడంతో పట్టణంలో ఆధ్యాత్మికతతో కూడిన సందడి నెలకొంది. అనంతరం శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మటంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తవార్ రాజేశ్వర్, సభ్యులు హరీష్, శివకుమార్, కృష్ణ ఉప్లాచివర్, ప్రవీణ్ మహజన్, ప్రియాంక, సౌరాబ్, ప్రవీణ్ కౌటిక్ తదితరులు పాల్గొన్నారు.