కాంగ్రెస్ టికెట్లపై సర్వత్రా ఉత్కంఠ..
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు విషయంలో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుండడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దిశ ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు విషయంలో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుండడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు వారి అనుచర గణంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న కసరత్తు ఉత్కంఠను రేపుతున్నది. అభ్యర్థులు సహా ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ దారి పట్టారు. పార్టీ అధిష్టానం నుంచి కొందరు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అందుబాటులో ఉండాలని ఫోన్లు సైతం చేసినట్లు సమాచారం.
తొలి జాబితాలో ఖరారు ఎందరికి..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ త్వరలోనే విడుదల చేయనున్న తొలి జాబితాలో ఎందరు అభ్యర్థులకు టికెట్లు లభిస్తాయన్న ఉత్కంఠ మొదలైంది. ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలు, బహుజన సమాజ్ పార్టీ, తెలంగాణ జన సమితి తదితర పార్టీలతో పొత్తుల చర్చలు జరుగుతుండగా మరోవైపు కాంగ్రెస్ తొలి జాబితాలో 70 మంది అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
అయితే పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించనున్న సీట్లపై ఇప్పటికిప్పుడే స్పష్టత ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తొలి జాబితాలో నిర్మల్, మంచిర్యాల రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో ఒకటి రెండు నియోజకవర్గాల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని అయితే ఆ నియోజకవర్గాలు ఏవన్నది తేలడం లేదు. నిర్మల్ నియోజకవర్గంలో శ్రీహరి రావు, మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు లేదా ఆయన సతీమణి సురేఖ లలో ఒకరికి టికెట్ దక్కడం ఖాయమని సమాచారం.
మిగిలిన నియోజకవర్గాల్లో పోటాపోటీ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది. పొత్తుల్లో భాగంగా బెల్లంపల్లి సిర్పూర్ నియోజకవర్గాలు ఖచ్చితంగా ఇతర పార్టీలకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ముథోల్ నియోజకవర్గంపై సందిగ్ధత ఉంది. బోథ్ నియోజకవర్గంలో మహిళా అభ్యర్థి పార్వతీ రాథోడ్, ఆడే గజేందర్, డాక్టర్ అశోక్, నరేష్ జాదవ్ నలుగురు పోటీపడుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డి, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత ముగ్గురు పోటీలో ఉన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో వెడ్మ బోజ్జు, రేఖ నాయక్, చారులత, రాథోడ్ భరత్, చౌహాన్ టికెట్ ఆశిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రవాణా రిటైర్డ్ అధికారి శ్యాం నాయక్, డాక్టర్ గణేష్ జాదవ్, మరసకోల సరస్వతి, ఆడే శేషారావు టికెట్ ఆశిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇటీవల పార్టీలో చేరిన నల్లాల ఓదెలు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాజా రమేష్ సహా మాజీ మంత్రి జీ వినోద్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది.
Read More: మళ్లీ సొంత గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకి మరో బిగ్ షాక్ తప్పదా..?