Eleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీజేపీకి లేదు
భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిర్మల్ : భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆయన నిర్మల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ దేనని, బీఆర్ఎస్ తో కుమ్మక్కయింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. అందుకే ఆ పార్టీ ముఖ్యనేతలపై కేసులు పెట్టడం లేదని పేర్కొన్నారు.క్యాబినెట్ లో విభేదాలు, కాంగ్రెసులో కుమ్ములాటలను కట్టడి చేయలేని సీఎం రేవంత్ రెడ్డి తమ లోపాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తో కలిసి బీజేపీని కూల్చేందుకు ప్రయత్నిస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చేయించడం ముఖ్యమంత్రి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ మంత్రి శ్రీధర్ బాబు అవివేకంతో నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని, బీఆర్ఎస్ తో గతంలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెసుదన్నారు.
మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ కూటమి ప్రభుత్వాలు అంతర్గత కుమ్ములాటలతో కూలిపోయాయే తప్ప అందులో బిజెపి ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడానికి గల కాంగ్రెసులోని అంతర్గత కుమ్ములాటలేనన్న వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ బీజేపీని బద్నాం చేసేలా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం కుట్రపూరితమని, బిజెపిని అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం మంత్రి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వ్యయం లక్షన్నర కోట్లు అని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే, అలాంటిదేమీ లేదని అసలు డిపిఆరే రెడీ కాలేదని డిప్యూటీ సిఎం భట్టి చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
క్యాబినెటులో మొదట్నుంచి కాంగ్రెసులో కొనసాగుతున్న ఆరుగురు మంత్రులు ఒక గ్రూపుగా, సీఎంతో సహా టీడీపీ, బీఆర్ఎస్ ల నుంచి వచ్చిన మిగిలిన ఆరుగురు మరో గ్రూపు మరో వర్గంగా విడిపోయారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో కుమ్మక్కయింది కాంగ్రెస్సేనని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నో అక్రమాలు, భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసిఆర్ కుటుంబం తిన్నదంతా కక్కిస్తామని, కేసిఆర్ తో పాటు హరీష్ రావు, కేటిఆర్ వంటి మాజీ మంత్రులపై కేసులు తప్పవని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఇపుడు 11 నెలలుగా బీఆర్ఎస్ నేతలపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెర వెనుక జరుగుతున్న మంత్రాంగమేంటో మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, మిషన్ భగీరధ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి భారీ అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఇప్పటి వరకు ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అరెస్టు చేయకపోవడం వెనక మతలబేంటని, అసలు ఈ కేసులను కాంగ్రెస్ సర్కారు సిబిఐ విచారణకు ఇవ్వకపోవడం అంటే బీఆర్ఎస్ నేతలను కాపాడడం కాదా అని ప్రశ్నించారు.