రోజు రోజుకి పెరుగుతున్న విద్యుత్‌ ప్రమాదాలు..

మండల కేంద్రంలో ఎక్కడో ఒక చోట విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Update: 2023-03-18 10:01 GMT

దిశ, సారంగాపూర్ : మండల కేంద్రంలో ఎక్కడో ఒక చోట విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విద్యుదాఘాతంతో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం, అజాగ్రత్త తదితర కారణాలతో విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దుప్పి, అడవి పంది, మనుబోతు, జింక వంటి మూగజీవాలు విద్యుత్ ప్రమాదానికి లోనైనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చేను యజమానులు మాంసాన్ని భుజించి కళేబరాలను భూమిలో పాతి పెడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 38 మంది మనుషులు మృతి చెందారు.

168 పశువులు విద్యుత్‌ షాక్‌తో మృత్యువాతపడ్డాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ పొలాల్లో పశువులతో పాటు మనుషులు విద్యుత్‌ ప్రమాదాలకు బలవుతున్నారు. ఈ మరణాల్లో సగానికి పైగా విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. పలుచోట్ల చేతికి అందే ఎత్తులో విద్యుత్‌ తీగలు ఉండడం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ కంచెలు లేకపోవడం, కరెంటు వైర్లు తెగి పొలాల్లో కింద పడడం ఇతర కారణాలతో విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని కంచెలకు విద్యుత్ తీగల తొలగించాలని పలువురు వాపోతున్నారు.

Tags:    

Similar News