ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలేవి..
ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు పరిష్కారానికి తీసుకున్న చర్యలేవని సభ్యులు ప్రశ్నించారు.
దిశ, ముధోల్ : ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు పరిష్కారానికి తీసుకున్న చర్యలేవని సభ్యులు ప్రశ్నించారు. మంగళవారం మండల కేంద్రమైన ముధోల్లోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన మండల సర్వేసభ్య సమావేశాన్ని నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ఆకాష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. 1490 కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు జారీ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ భారత్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారి అజ్మీరా భాస్కర్ మాట్లాడుతూ మండలంలోని 17 మంది రైతులు మృతి చెందగా 11 మందికి రైతు భీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున నామిని అకౌంటులోజమ చేశామన్నారు.
మిగతా లబ్ధిదారులకు త్వరలోనే అందుతాయని పేర్కొన్నారు. బ్రహ్మణగాం సర్పంచ్ రామ్ రెడ్డి మాట్లాడుతూ శనగ రైతులకు టోకెన్ల జారీకి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందించాలని కోరారు. అదేవిధంగా కో-ఆప్షన్ సభ్యుడు ఖాలీద్, ఎంపీటీసీ దేవుడి భూమేష్ మాట్లాడుతూ ఏడీఏ అందుబాటులో ఉండడం లేదని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత శాఖ జేడిఏకు అధికారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసి పంపాలని సూచించారు. ఆయిల్ ఫామ్ రైతులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని సర్పంచ్ రామ్ రెడ్డి కోరారు. ఉపాధిహామీ, వెటర్నరీ ఆర్ అండ్ బీ, పంచాయత్ రాజ్, ఐకేపీ అధికారులు తమ శాఖకు సంబంధించిన నివేదికలు చదివి వినిపించారు. మిషన్ భగీరథ పనులు ముధోల్, ఎడబిడ్ గ్రామాల్లో పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
ముధోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ మాట్లాడుతూ అసంపూర్తి పనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ద్వారా మరమ్మతులు చేసుకుంటామని వెల్లడించారు. అయితే పనులు పూర్తిచేయడం పై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా ఇటీవలే ప్రయాణ ప్రాంగణం ముందర గల తాత్కాలిక షెడ్లను అధికారులు తొలగించడంతో చిరువ్యాపారులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వాపోయారు. దీంతో కుటుంబ పోషణ కొరకు చిరువ్యాపారస్తులు రోడ్డుపై కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మండల సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన అంశాలు ముందుకెళ్లడం లేదని ముద్గల్ సర్పంచ్ రామచందర్ అన్నారు. రేషన్ లబ్ధిదారుల సౌకర్యార్థం సరస్వతి నగర్లో రేషన్ షాపును ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
వెంకటపూర్, ముద్గల్ సర్పంచ్లు సాయినాథ్ రామచంద్ర మాట్లాడుతూ గ్రామపంచాయతీల ద్వారా ఇచ్చే హౌస్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ జారీ ఎందుకు నిలిపివేశారని మండల పంచాయతీ అధికారి అమీర్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అసెస్మెంట్ సర్టిఫికెట్ అయినా జారీ చేయాలని పేర్కొన్నారు. ఓనర్ షిప్ సర్టిఫికెట్ జారీ నిలిపివేయడంతో లబ్ధిదారులు ఆందోళన గురి అవుతున్నారని వెల్లడించారు. ఇతర మండలాల్లో సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఇక్కడ మాత్రం జారీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. దోమల బెడద, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడంతో ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎంపీటీసీ దేవోజి భూమేష్ అన్నారు.
అధికారుల పర్యవేక్షణ కరవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ముధోల్ ను మున్సిపాలిటీగా చేయడంతో పాటు డిగ్రీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు పై తీర్మానం చేయాలని సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ కోరారు. ఇటుక బట్టీల్లో కట్టెలను ఉపయోగిస్తున్నారని సర్పంచ్ రామచందర్ అధికార దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా ఇటుక బట్టీలలో అనుమతి లేకుండా విద్యుత్తు ఉపయోగిస్తే విజిలెన్స్ అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసిన రైతులకు వాల్టాచట్టానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని మినహాయించాలని ప్రజాప్రతినిధులు కోరారు.
పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ 23 నుండి ముధోల్ బాసర మండలాల్లో శనగ కొనుగోలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బుధవారం నుండి రైతులకు టోకెన్లు సైతం జారీ చేస్తామన్నారు. రైతులు కష్టపడి పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు, సర్పంచులు రాజేందర్ రెడ్డి, విజేష్, ఎంపీటీసీలు గంగాధర్, ఆత్మస్వరూప్, లక్ష్మీనారాయణ, జ్యోతి దేవన్న, వివిధ శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.