belt shops : సిండికేట్ దందా.. మద్యం దుకాణాల్లో దోపిడి..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు ( Liquor sales ) ఇష్టారాజ్యమయ్యాయి.
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు ( Liquor sales ) ఇష్టారాజ్యమయ్యాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మద్యం దుకాణదారులు సిండికేట్ గా ఏర్పడి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరో వైపు బెల్టు షాపుల నిర్వాహకులు మాత్రం ఎమ్మార్పీ ధరకే విక్రయిస్తున్నారు. ఒక మద్యం సీసా పై 10 నుంచి 20 వరకు ఆయా కంపెనీలను బట్టి వసూళ్లు చేస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు.
బెల్ట్ షాపుల జోరు..
పట్టణ, గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు ఇంత అంత కాదు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణాల్లో నడిబొడ్డున పర్మిట్ రూముల మాటున యథేచ్ఛగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాలు తెరవక ముందు, మూసీ వేసిన తర్వాత మద్యం ప్రియులంతా బెల్ట్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో హోటల్, దాబాలు, కిరాణా దుకాణాల మాదిరిగా ఉన్నప్పటికీ లోపల తతంగమంతా వేరేలా ఉంటుంది. మద్యం విక్రయాలతో పాటు అక్కడే తాగేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కూర్చుని సంపాదించే మార్గంగా బెల్ట్ షాపులను ఎన్నుకుంటున్నారు. మద్యం సీసా, బీర్ల పై అదనంగా రూ. 20 నుంచి 30 వరకు వసూళ్లు చేస్తున్నారు. చిన్న బెల్టు షాపు అయిన రోజుకు ఎంత లేదన్నా వెయ్యి నుంచి 1500 వరకు ఆదాయం వస్తుండడంతో బెల్ట్ షాపుల నిర్వహణ పై చాలా మంది మొగ్గు చూపుతున్నారు.
టార్గెట్ కోసం చూసీచూడనట్లు..
బెల్ట్ షాపుల్లో ఇంత బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులకు నెలవారీగా విధించే మద్యం అమ్మకాల టార్గెట్ కోసం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని ఒక్క కాగజ్ నగర్ పట్టణంలోనే మూడు బార్లు ప్రభుత్వ అనుమతిలో కొనసాగిస్తున్నాయి. మిగతావి అన్ని వైన్ షాపులే ఉన్నాయి. వీటిలో ఎలాంటి సిట్టింగ్ ఉండకూడదు. అయినా యాథేచ్ఛగా వైన్స్ షాపుల్లో సిట్టింగ్ నిర్వహిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వీరి అక్రమాలకు అంతేలేకుండా పోయింది. ఏది ఏమైనా పట్టణ గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపులను నియంత్రించాలని ప్రజాసంఘాలు, మహిళలు కోరుతున్నారు.