విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, లక్షెట్టిపేట : ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు తెలిపారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులను వినియోగించాలని సూచించారు. వంటశాల, మూత్రశాలలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమయానుసారం పిల్లల ఎత్తు, బరువు పరీక్షించాలని, పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని కోరారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్వాహకులకు ఆదేశించారు. అనంతరం 30 పకడల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.