మళ్లీ బలహీన వర్గాల పక్కా గృహాలు..!
బలహీనవర్గాల పక్కాగృహాలు గుర్తున్నాయా..? పేదలకు నీడనిచ్చేందుకు ఎన్టీ రామారావు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఇళ్ల నిర్మాణాలు ఈ పథకం కింద జరిగినవే.
దిశ ప్రతినిధి, నిర్మల్ : బలహీనవర్గాల పక్కాగృహాలు గుర్తున్నాయా..? పేదలకు నీడనిచ్చేందుకు ఎన్టీ రామారావు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఇళ్ల నిర్మాణాలు ఈ పథకం కింద జరిగినవే. ఆ తర్వాతి ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించినప్పటికీ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట పేదలకు ఇండ్లు అందించే పథకాలను తెచ్చారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ఆశించిన స్థాయిలో కార్యరూపం దాల్చకపోవడం ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం బలహీనవర్గాల ఇళ్లస్థలాల పథకాన్ని తెరమీదకు తెస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అంతర్గతంగా ఆయా ప్రభుత్వ శాఖలను స్థలాల గుర్తింపునకు ఆదేశించింది. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
మళ్లీ బలహీనవర్గాల గృహాలు..?
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం సక్సెస్ కాకపోవడం నిర్మాణ వ్యయం భారీగా పెరగడం వల్ల ఖజానా తడిసి మోపెడై భారం పడుతుండడంతో క్రమంగా ఆ పథకానికి ప్రభుత్వం స్వస్తి చెప్పే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాజాగా బలహీనవర్గాల ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా స్థలాల గుర్తింపునకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చూస్తే మళ్ళీ బలహీనవర్గాల పక్కా గృహాల నిర్మాణం అమలులోకి వచ్చేలా కనిపిస్తోంది. ఈ మేరకు మెమో నెంబర్ 533/ ఎల్ ఏ/2023 ను జారీ చేసింది. తాజా పథకాన్ని సామాజిక భద్రత కార్యక్రమం కింద దశాబ్దాలుగా కనీస నివాస సౌకర్యం లేని వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆ మెమోలో ఆదేశించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర ఆర్థికంగా బలహీనంగా ఉన్న కమ్యూనిటీ కుటుంబాలకు ఉచితంగా బలహీన వర్గాల ఇండ్ల ప్లాట్లను అందజేయనున్నారు.
ఎస్సీ అభివృద్ధి శాఖకు సమన్వయ బాధ్యతలు...
సామాజిక భద్రత కింద పేదకుటుంబాలకు బలహీన వర్గాల ఇళ్ల పట్టాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ ద్వారా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి స్థలాలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేటు స్థలాలు సీలింగు భూములు ఎండోమెంట్ భూములు సర్ ప్లస్ భూములు ప్రభుత్వ భూములను సేకరించాలని ఆదేశించిన ప్రభుత్వం నిధులు కూడా ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారానే ఖర్చు పెట్టాలని సూచించింది. అయితే గతంలో ఇళ్ల స్థలాలను గుర్తించి పట్టాలు అందని లబ్ధిదారులను, అలాగే పట్టాలు ఇచ్చి వారికి లబ్ధిదారులను గుర్తించాలని సూచించింది. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం భూములను ఆయా శాఖలకు ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా ఆ భూములను ఉపయోగించినట్లయితే వాటి వివరాలను కూడా వెంటనే పంపాలని ప్రభుత్వం సూచించింది. ఇలాంటి భూములన్నింటిని గుర్తించిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు బలహీన వర్గాల పక్కా గృహాల నిర్మాణం కింద ప్లాట్ల పట్టాలను ప్రభుత్వం అందించడం ఉందని సమాచారం.
మూడు లక్షల ఆర్థిక చేయూత ఇందులో భాగమేనా..?
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించే పథకానికి ప్రభుత్వం స్వస్తి చెప్పేలా ఉంది. ఇల్లు లేని పేదలకు పట్టాలు అందజేసి ఆ తర్వాత నిర్మాణం కోసం మూడు లక్షలు అందజేసే అవకాశం ఉంది. ఇప్పటికే పేదలకు ఖాళీస్థలం కలిగి ఉంటే మూడు లక్షలు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం... ఆ తర్వాత ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి కూడా ఇదే తరహాలో 3 ఆర్థిక సహాయం అందజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తీవ్రమైన ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకే...
ప్రభుత్వం పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా భారీగా ఆర్థిక భారం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలంటే ఖాళీ స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కనీసం 10 నుండి 15 లక్షల దాకా ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఇంతటి భారాన్ని ప్రభుత్వం మోసే పరిస్థితిలో లేదంటున్నారు. దాని నుండి తప్పించుకునేందుకే తాజా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఖాళీ స్థలం ఇచ్చి మూడు లక్షల ఆర్థిక సహాయం అందిస్తే లబ్ధిదారులు కట్టుకునే ఇల్లు గతంలోని బలహీన వర్గాల పక్కా గృహాలే నిర్మాణం అవుతాయని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.